Cynyde Mohan: సీరియల్ కిల్లర్ 'సైనైడ్' మోహన్ కు ఇరవయ్యవ హత్య కేసులో జీవిత ఖైదు!

  • ఇప్పటికే మరణదండన సహా పలు శిక్షలు
  • తాజా కేసులో జీవిత ఖైదు
  • 2009లో యువతిపై అత్యాచారం హత్య
Cyanide Mohan Jailed For Life For Rape

కర్ణాటకలో తీవ్ర కలకలం రేపిన సైనైడ్ మోహన్ కు 20వ కేసులో జీవిత ఖైదు పడింది. దాదాపు 20 మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడి, వారిపై సైనైడ్ ను ప్రయోగించి, దారుణాతి దారుణంగా చంపిన మోహన్ పేరు, ఆపై సైనైడ్ మోహన్ గా స్థిరపడింది. ఇప్పటికే జైల్లో ఉన్న అతనిపై 2009లో కేరళ మహిళపై రేప్ చేసిన కేసు ప్రూవ్ అయింది. ప్రస్తుతం 57 ఏళ్ల వయసులో ఉన్న మోహన్ ను ఈ కేసులో దోషిగా నిర్ధారించిన కోర్టు జీవిత ఖైదును విధిస్తున్నట్టు ప్రకటించింది.

కేరళలోని కాసర్ గోడ్ కు చెందిన 25 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, బెంగళూరుకు తీసుకెళ్లిన మోహన్, ఓ లాడ్జిలో బస చేసి, అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై గర్భ నిరోధక మాత్రని చెబుతూ, సైనైడ్ పూసిన మాత్ర ఇవ్వడంతో ఆమె మరణించింది. ఇదిలావుంచితే, అంతకుముందు మోహన్ 19 మందిపై లైంగిక దాడులు చేసి, సైనైడ్ తో చంపాడు. మొత్తం 46 మంది సాక్షులను విచారించి, 89 ఆధారాలను పరిశీలించిన మంగళూరు 6వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి జీవిత ఖైదు విధిస్తున్నట్టు తీర్పిచ్చారు.

మృతురాలి వద్ద మోహన్ దొంగిలించిన ఆభరణాన్ని అతని రెండవ భార్య వద్ద పోలీసులు రికవర్ చేశారు. దీన్ని మృతురాలి తల్లికి అందించాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఇప్పటికే మోహన్ కు ఐదు కేసుల్లో మరణశిక్ష, మిగిలిన కేసుల్లో జీవిత ఖైదు విధించారు. అతన్ని ఉరి తీసి చంపాలని బాధిత కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తూనే ఉన్నాయి.

More Telugu News