India: ప్రపంచానికే ఇండియా ఓ గొప్ప ఔషధాలయం!: చైనా సంస్థ కితాబు

  • ఇప్పటికే 133 దేశాలకు ఔషధాలు పంపిన ఇండియా
  • ఇండియాలో నిష్ణాతులైన సైంటిస్టులున్నారు
  • తక్కువ ధరకే మందులు తయారు చేసే సత్తా భారత్ దే
  • షాంగై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ సెక్రెటరీ జనరల్ వ్లాదిమిర్ నోరోవ్
India is Now World Farmacy says SCO

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ సమయంలో ప్రపంచం మొత్తానికి భారత్ ఔషధాలయం (ఫార్మసీ)గా మారిందని షాంగై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ సెక్రెటరీ జనరల్ వ్లాదిమిర్ నోరోవ్ పొగడ్తలు గుప్పించారు. వైద్య చికిత్సలు, ఔషధాలపై ఇండియాకు ఎంతో అనుభవముందని ఆయన కితాబిచ్చారు. కాగా, ఇండియా ఇప్పటివరకూ 133 దేశాలకు కరోనా చికిత్సలో ఉపయోగపడే మందులను ఎగుమతి చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఇండియాలో కేసులు పెరుగుతున్నా, ఇండియా ఔషధాలను పంపిందని పీటీఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో నోరోవ్ వ్యాఖ్యానించారు.

వైద్య రంగంలో ఓ కీలక శక్తిగా ఉన్న ఇండియా కరోనా విషయంలో బాధ్యతాయుతమైన దేశంగా ప్రవర్తించిందని, ఎస్సీఓ మిగతా సభ్య దేశాల నుంచి భారత్ కు మద్దతు లభిస్తోందని ఆయన అన్నారు. ఇటీవలే ఐక్యరాజ్యసమితిలో తాత్కాలిక సభ్య హోదా ఇండియాకు లభించిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన, శక్తిమంతమైన ఐరాసలోకి భారత్ ప్రవేశించడం శుభ పరిణామమని అన్నారు.

కరోనాకు వ్యాక్సిన్ ను కనుగొనే క్రమంలో భారత్ లోని నిష్ణాతులైన సైంటిస్టులు, వైద్య విజ్ఞానులు క్రియాశీల పాత్రను పోషిస్తారన్న నమ్మకం ఉందని నోరోవ్ వ్యాఖ్యానించారు. ఇండియాలో నాణ్యమైన ఔషధాలు, తక్కువ ధరకే తయారు అవుతాయని అభిప్రాయపడ్డారు. గ్లోబల్ జనరిక్ మెడిసిన్ విభాగంలో ప్రపంచంలో 20 శాతం ఇండియాలోనే తయారవుతున్నాయని గుర్తు చేసిన ఆయన, ప్రపంచానికి అవసరమైన వాక్సిన్ లలో 62 శాతం ఇండియాలోనే తయారవుతున్నాయని కితాబునిచ్చారు.

 కాగా. బీజింగ్ కేంద్రంగా నడుస్తున్న ఎస్సీఓ లో ఎనిమిది సభ్య దేశాలు ఉన్నాయి. 2017లో ఇండియా, పాకిస్థాన్ లకు ప్రవేశం లభించింది. వీటితో పాటు చైనా, రష్యా, కజకిస్థాన్, కిర్గిస్థాన్, తజకిస్థాన్, ఉజ్బెకిస్తాన్ ప్రస్తుతం సభ్య దేశాలుగా ఉన్నాయి.

More Telugu News