Kinjarapu Acchamnaidu: విజయవాడకు రాగానే కోర్టుకు అచ్చెన్నాయుడు.. ఆపై కస్టడీకి కోరనున్న పోలీసులు!

  • తునిలో కాన్వాయ్ ని అడ్డుకునేందుకు టీడీపీ యత్నం
  • విజయవాడకు తేగానే వైద్య పరీక్షలు
  • కస్టడీ పిటిషన్ ను సిద్ధం చేసిన అధికారులు
  • వాదనలు ఓ కొలిక్కి రాకుంటే జైలుకు తరలింపు తథ్యం
Acchamnaidu on the way to Vijayawada

ఈ తెల్లవారుజామున శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో అరెస్టయిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని విజయవాడకు తరలిస్తున్న ఏసీబీ కాన్వాయ్ తుని పట్టణాన్ని దాటింది. అప్పటికే విషయం తెలుసుకున్న తునిలోని కొందరు టీడీపీ నేతలు, కార్యకర్తలు, రోడ్డుకు అడ్డంగా బైఠాయించేందుకు సిద్ధపడగా, పోలీసులు వారిని అడ్డుకున్నారని తెలుస్తోంది.

ఇక, ఈ మధ్యాహ్నం అచ్చెన్నాయుడిని విజయవాడకు తీసుకురాగానే, నేరుగా ఏసీబీ కార్యాలయానికి తరలించనున్న అధికారులు, అక్కడి నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లి, వైద్య పరీక్షల అనంతరం న్యాయస్థానం ముందు హాజరు పరుస్తారని తెలుస్తోంది. అదే సమయంలో ఆయన్ను కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్ ను కూడా ఏసీబీ దాఖలు చేయనుంది.

ఈఎస్ఐ స్కామ్ లో తదుపరి విచారణ నిమిత్తం నాటి మంత్రి అచ్చెన్నాయుడిని తప్పనిసరిగా ప్రశ్నించాల్సి వున్నందున, వారం రోజుల కస్టడీని అధికారులు కోరనున్నట్టు సమాచారం. కస్టడీకి న్యాయమూర్తి అంగీకరించిన పక్షంలో, ఆయన్ను ఎక్కడుంచి విచారణ జరిపించాలన్న విషయమై ఉన్నతాధికారులు సమాలోచనలు చేస్తున్నారు. కస్టడీ పిటిషన్ పై వాదనలు తేలని పక్షంలో రిమాండ్ విధిస్తే మాత్రం అచ్చెన్నాయుడిని జైలుకు తరలిస్తారు. మరోవైపు అచ్చెన్నాయుడి తరఫున కోర్టులో వాదనలు వినిపించేందుకు ఆయన తరఫు న్యాయవాదులు సిద్ధమవుతున్నట్టు సమాచారం.

More Telugu News