అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన డాక్టర్ సుధాకర్!

07-06-2020 Sun 09:22
  • కోర్టు ఆదేశాల మేరకు డిశ్చార్జ్
  • విశాఖలోనే రహస్య ప్రాంతంలో విశ్రాంతి
  • ఐదు రోజులు ఎవరినీ కలవబోరన్న సన్నిహతులు
Dr Sudhakar Went to Secret Place after Discharge from Mental Hospital
విశాఖపట్నం ప్రభుత్వ మానసిక వైద్యశాల నుంచి కోర్టు ఆదేశాల మేరకు డిశ్చార్జ్ అయిన డాక్టర్ సుధాకర్, అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నగరంలోనే ఓ రహస్య ప్రాంతంలో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని సన్నిహితులు తెలిపారు. ఐదు రోజుల వరకూ ఆయన ఎవరినీ కలువబోరని వెల్లడించారు. తనకు మానసిక ప్రశాంతత కావాలని ఆయన కోరుకుంటున్నారని అన్నారు.

కాగా, సుధాకర్ ను మెంటల్ హాస్పిటల్ లో ఎవరు చేర్పించారన్న విషయమై ఇంతవరకూ స్పష్టత రాకపోవడం గమనార్హం. ఆయనే స్వయంగా వచ్చారని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాధారాణి వెల్లడించగా, పోలీసులే ఆయన్ను తీసుకెళ్లారని కేజీహెచ్ అధికారులు అంటున్నారు. సుధాకర్ కేజీహెచ్ ఓపీ విభాగంలో హడావుడి సృష్టించడంతో మానసిక వైద్య శాలకు తీసుకెళ్లాలని కోరగా, పోలీసులు తీసుకెళ్లారని అంటున్నారు. దీనిపై సీబీఐ మరింత లోతుగా విచారిస్తోంది. పోలీసులు డాక్టర్ సుధాకర్ ను అదుపులోకి తీసుకున్న తీరు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.