మా నాన్నకు బెయిల్ వచ్చేలా చూడండి: కిషన్ రెడ్డిని కోరిన వరవరరావు కుమార్తెలు

30-05-2020 Sat 15:21
  • బీమా కోరేగావ్ కేసులో ముంబయి జైల్లో ఉన్న వరవరరావు
  • అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఆసుపత్రికి తరలింపు
  • ఎన్ఐఏ బెయిల్ వ్యతిరేకిస్తోందన్న వరవరరావు కుమార్తెలు
Daughters of Varavararao requests Kishan Reddy to look into the matter

విరసం నేత వరవరరావు బీమా కోరేగావ్ కేసులో ముంబయి జైల్లో ఉన్నారు. అయితే అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఆయనను జేజే ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలిసిన వరవరరావు కుమార్తెలు అనల, పవన తండ్రి ఆరోగ్య పరిస్థితి పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

తమ తండ్రికి బెయిల్ మంజూరు చేసేందుకు చొరవ తీసుకోవాలని వారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. బెయిల్ కోసం కోర్టును ఆశ్రయిస్తే, ఎన్ఐఏ అందుకు వ్యతిరేకిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ముంబయిలోని తలోజా జైలు నుంచి తమ తండ్రిని ఆసుపత్రికి తరలించిన విషయమై జైలు వర్గాలు తమకు సమాచారం అందించలేదని వారు ఆరోపించారు. తలోజా జైల్లో ఓ ఖైదీ కరోనాతో మరణించినట్టు తెలిసిందని, అలాగే జైలులో అపరిశుభ్ర వాతావరణం నెలకొని ఉందని తెలిపారు.