ఉంగుటూరులో ఎన్టీఆర్‌కు నివాళులర్పిస్తోన్న టీడీపీ కార్యకర్తలపై దాడి దుర్మార్గం: చంద్రబాబు

29-05-2020 Fri 10:46
  • వైసీపీకి చెందిన వారే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు
  • దాడి చేసిన వైసీపీ కార్యకర్తలను పోలీసులు వదిలేశారు
  • ఎన్నికల్లో పోటీ చేస్తోన్న టీడీపీ అభ్యర్థులపై కూడా దాడి చేశారు 
chandrababu fires on ap govt

పెదకూరపాడు నియోజకవర్గం ఉంగుటూరులో టీడీపీ కార్యకర్తలపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. వైసీపీకి చెందిన వారే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని, ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న టీడీపీ కార్యకర్తలపై దాడి చేయడం దుర్మార్గమని ఆయన చెప్పారు.

వైసీపీ అరాచకాలకు కళ్లెం వేయాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై ఏపీ డీజీపీ జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దాడి చేసిన వైసీపీ కార్యకర్తల్ని పోలీసులు వదిలేశారని, గాయపడిన బాధితులను అరెస్ట్ చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు.

కొన్ని రోజుల క్రితం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తోన్న టీడీపీ అభ్యర్థులపై కూడా దాడి చేశారని ఆయన చెప్పారు. నిందితులపై చర్యలు లేకుండా బాధితులపైనే ఎదురు కేసులు పెట్టడం హేయమని వ్యాఖ్యానించారు. నిందితులను అరెస్టు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. బాధితులపై కేసులు పెట్టడం వైసీపీ ఆటవిక రాజ్యానికి నిదర్శనమని, వారిపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేయాలని ఆయన అన్నారు.