ఇండస్ట్రీ అంటే ఎన్టీఆర్, చిరంజీవి ఫ్యామిలీనే కాదు: నాగబాబు

28-05-2020 Thu 20:06
  • ఇండస్ట్రీలో చాలా ఫ్యామిలీలు ఉన్నాయి
  • మీటింగ్ కు, ఫ్యామిలీలకు సంబంధం లేదు
  • బాలకృష్ణ నోటికొచ్చినట్టు మాట్లాడారు
Tollywood means not NTR or Chiranjeevi family says Nagababu

మంత్రి తలసానితో సినీ ప్రముఖులు జరిపిన చర్చలకు తనను పిలవలేదని బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. భూములు పంచుకున్నారా? అని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలయ్య వ్యాఖ్యలను మెగా బ్రదర్ నాగబాబు తప్పుపట్టారు.

బాలయ్య కేవలం హీరో మాత్రమే కాదని, ఎమ్మెల్యే కూడా అని... ఆయన వ్యాఖ్యలు బాధ్యతాయుతంగా ఉండాలని అన్నారు. ఇదే అంశానికి సంబంధించి ఓ టీవీ చానల్ తో నాగబాబు మాట్లాడారు. ఇండస్ట్రీకి చెందిన పలువురు హాజరైన సమావేశానికి... ఎన్టీఆర్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తిని పిలవాల్సిన అవసరం లేదా అని చానల్ అడిగిన ప్రశ్నకు బదులుగా... ఆయనను చర్చలకు పిలవాలని తాను కూడా చెపుతున్నానని అన్నారు.

సినీ పరిశ్రమ అంటే ఎన్టీఆర్, చిరంజీవి ఫ్యామిలీ మాత్రమే కాదని... ఏఎన్నార్, కృష్ణ కుటుంబాలతో పాటు మరికొన్ని ఫ్యామిలీలు ఉన్నాయని అన్నారు. మీటింగ్ కు, ఫ్యామిలీలకు సంబంధం లేదని చెప్పారు. బాలకృష్ణ నోటికొచ్చినట్టు మాట్లాడారని చెప్పారు. భూములు పంచుకున్నారని ఆయన అంటే... అమరావతిలో తెలుగుదేశం పార్టీ ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిందని తాను అనగలనని అన్నారు.

మరోవైపు, జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే పరిస్థితి ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. నాగబాబుపై బాలయ్య ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఇది మరెన్ని మలుపులు తీసుకుంటుందో వేచి చూడాలి.