Internet Speed: ఇంటర్నెట్ స్పీడ్ లో ఆస్ట్రేలియా సరికొత్త రికార్డు... సెకనులో 1000 హెచ్డీ సినిమాల డౌన్ లోడ్!

Australia Researchers Records above 44 TBPS Internet Speed
  • సెకనుకు 44.2 టీబీ వేగం
  • ఫలించిన మూడు వర్శిటీల రీసెర్చర్ల కృషి
  • ఇప్పటికే ఉన్న మౌలిక వసతులతోనే ప్రయోగాలు
ఇంటర్నెట్ వేగంలో ఆస్ట్రేలియా రీసెర్చర్లు సరికొత్త రికార్డును నమోదు చేశారు. ఒక్క సెకను వ్యవధిలో 1000 హై డెఫినిషన్ చిత్రాలను డౌన్ లోడ్ చేసుకునేంత వేగాన్ని వారు సాధించారు. సెకనుకు 44.2 టెరాబైట్ల వేగాన్ని చూపించారు. మోనాష్, స్విన్ బర్న్, ఆర్ఎంఐటీ యూనివర్శిటీల రీసెర్చర్లు సంయుక్తంగా ఈ రికార్డును నమోదు చేశాయి. ఈ టీమ్ కు  డాక్టర్ బిల్ కోర్కోరన్, అర్మన్ మిచెల్, డేవిడ్ మాస్ లు నేతృత్వం వహించారు.

ఇంటర్నెట్ వేగాన్ని పరిశీలించేందుకు మెల్ బోర్న్ నగరంలో 76.6 కిలోమీటర్ల డార్క్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ను ఇన్ స్టాల్ చేశారు. ఏక కాంతిపుంజం ద్వారా 44.2 టీబీపీఎస్ వేగాన్ని వీరు రికార్డు చేశారు. నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్ లో వీరి పరిశోధనల వివరాలు ప్రచురితం అయ్యాయి. డేటా ఆప్టిక్స్, టెలి కమ్యూనికేషన్స్ రంగాల్లో విప్లవాత్మక మార్పును తీసుకువచ్చేలా రీసెర్చర్ల ప్రయోగాలు ఫలితాలనిచ్చాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇంటర్నెట్ వేగాన్ని పెంచడం కోసం 'మైక్రో-కోంబ్' పేరిట ఓ పరికరాన్ని అభివృద్ధి చేసిన రీసెర్చర్లు 80 లేజర్లు ఇచ్చే వేగాన్ని దానికి అందించారు.

ఇక టెలీ కమ్యూనికేషన్స్ విభాగంలో ఇప్పటివరకూ ఉన్న హార్డ్ వేర్ తో పోలిస్తే, మైక్రో-కోంబ్ బరువు చాలా తక్కువ. పరిమాణంలోనూ ఇది చిన్నగా ఉంటుంది. ఎన్బీఎన్ (నేషనల్ బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్క్) కోసం ఏర్పాటు చేసిన పాత మౌలిక వసతులతోనే ల్యాబ్ బయట తమ కొత్త చిప్ సాయంతో వీరు ఇంత వేగాన్ని సాధించడం గమనార్హం.
Internet Speed
44.2 TBPS
Australia
Reserchers

More Telugu News