Corona Virus: కొత్త కరోనా కేంద్రాలు... గత రెండు రోజుల్లోని కేసుల్లో సగానికి పైగా ఐదు జిల్లాల నుంచే!

  • టాప్-5 రాష్ట్రాల్లో 77 శాతం కేసులు
  • టాప్-5 నగరాల్లోనే 52 శాతం కేసులు
  • 15 రోజులకు తగ్గిన కేసుల రెట్టింపు సమయం
Above Half New Corona Cases in Last 2 days from 5 Districts

ఇండియాలో కొత్త కరోనా కేంద్రాలు పుట్టుకు వస్తున్నాయి. ఇప్పటివరకూ మొత్తం కేసులు 1.25 లక్షలను దాటగా, రికవరీల సంఖ్య 50 వేలను దాటింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాల మేరకు గత వారంలో కేసుల సంఖ్య 30 శాతం (సోమవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకూ) పెరిగింది. ఇండియాలో తొలి కేసు జనవరి 30న నమోదుకాగా, 74 శాతం కేసులు మే నెలలోనే రావడం గమనార్హం.

ఇక ఇదే వేగంతో కేసులు పెరిగితే, మరో నాలుగు రోజుల్లోనే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షన్నరను దాటుతుందని అంచనా. కొత్త కేసులు నమోదయ్యే విషయంలోనూ, మరణాల విషయంలోనూ చాలా ఇతర దేశాలతో పోలిస్తే, ఇండియా వేగంగా కదులుతుండటం ఆందోళనను పెంచుతోంది. కేసులు రెట్టింపయ్యేందుకు పడుతున్న సమయం కూడా 15 రోజులకు తగ్గింది.

మహారాష్ట్రలో అత్యధికంగా 30 వేలకు పైగా కేసులుండగా, రెండో స్థానంలో నిలిచిన తమిళనాడులో 7,500కు పైగా కేసులున్నాయి. ఆ తరువాతి స్థానాల్లో 6,500కు పైగా కేసులతో గుజరాత్, 6,200కు పైగా కేసులతో న్యూఢిల్లీ ఉన్నాయి. కేసుల సంఖ్యలో టాప్-5లో ఉన్న రాష్ట్రాల్లో 77 శాతం కేసులున్నాయి. ఇక టాప్-10 రాష్ట్రాల్లో 91 శాతం కేసులున్నాయి.

ఇదిలావుండగా, గడచిన రెండు రోజుల్లో ముంబై, చెన్నై, థానే, అహ్మదాబాద్, పుణె జిల్లాల్లో కొత్త కేసుల సంఖ్య గణనీయంగా వచ్చాయి. ఈ రెండు రోజుల్లో వచ్చిన దాదాపు 11 వేల కేసుల్లో 55 శాతం ఈ ఐదు జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. వీటితో పాటు కోల్ కతా, హౌరా, బారాబంకి జిల్లాల్లోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ప్రమాదకరంగా పెరుగుతోంది. ఇండియాలోని 600 జిల్లాల్లో కరోనా కేసులు ఉండగా, ముంబైలో 27,251 కేసులున్నాయి. ఆపై అహ్మదాబాద్ లో 9,724, చెన్నైలో 9,361, థానేలో 5,590, పుణెలో 4,834 కేసులుండగా, దేశం మొత్తంలో నమోదైన కేసుల్లో ఇది 52 శాతానికి సమానం.

More Telugu News