యూపీలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ.. వలస కార్మికుల తరలింపులో వేడెక్కిన రాజకీయం!

20-05-2020 Wed 07:59
  • వలస కార్మికులను తరలించేందుకు కాంగ్రెస్ వెయ్యి బస్సులు
  • నడిపేందుకు ఆ బస్సులు అర్హమైనవి కాదంటున్న పోలీసులు
  • యూపీ కాంగ్రెస్ చీఫ్, ప్రియాంక గాంధీ పీఏపై కేసులు
UP Police case filed against UP Congress Chief and Priyanka Gandhi PA

వలస కార్మికులను తరలించేందుకు నడుపుతున్న బస్సుల విషయంలో నిబంధనలు పాటించలేదంటూ యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లూ, ప్రియాంక గాంధీ వ్యక్తిగత కార్యదర్శిపై లక్నో పోలీసులు కేసులు  నమోదు చేశారు.

వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించేందుకు కాంగ్రెస్ వెయ్యి బస్సులను నడుపుతోంది. అయితే, ఈ బస్సులకు అనుమతి లేదని చెబుతూ పోలీసులు కేసులు నమోదు చేశారు. తాము వెయ్యి బస్సులను నడుపుతున్నట్టు ప్రభుత్వానికి జాబితా ఇచ్చినప్పటికీ కేసులు నమోదు చేయడంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.

అయితే, కాంగ్రెస్ నడుపుతున్న బస్సుల్లో చాలా వాటికి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేదని, బీమా పత్రాలు లేవని, పార్టీ సమర్పించిన జాబితాలో కొన్ని ద్విచక్ర వాహనాలు, కొన్ని ఆటోలు, కార్ల నంబర్లు కూడా ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. ప్రియాంకగాంధీ సమర్పించిన బస్సుల జాబితాలో 79 బస్సులకు ఫిట్ నెస్, బీమా లేవని, అయా బస్సులు నడిపేందుకు అర్హమైనవి కావని అధికారులు తేల్చేశారు. దీంతో వలస కార్మికుల తరలింపులో కాంగ్రెస్ నేతలు నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపిస్తూ వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.