అలుపెరుగని నడక.. అరికాళ్ల నుంచి రక్తం.. పాత చెప్పులు ఇమ్మంటూ ప్రాధేయపడ్డ వలస కూలీ!
- ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాలో ఘటన
- గుజరాత్లోని సూరత్ నుంచి వెళ్లిన కూలీ
- 300 కిలోమీటర్ల దూరం నడవడంతో చెప్పులు తెగిపోయిన వైనం
- అయినా నడక ఆపని కూలీ
గుజరాత్లోని సూరత్ నగరంలోని వస్త్ర పరిశ్రమలో తిలోకి కుమార్ పనిచేశాడు. శ్రామిక్ రైలులో ప్రయాణానికి తన పేర్లు నమోదు చేసుకొని వారం రోజులు గడిచినా ఎవరూ స్పందించకపోవడంతో తోటి కార్మికులతో కలిసి స్వగ్రామానికి కాలినడకనే బయలుదేరాడు.
దాదాపు 300 కిలోమీటర్ల దూరం నడిచాక తన కాళ్లకు ఉన్న చెప్పులు పూర్తిగా అరిగిపోయి, తెగిపోయాయని చెప్పాడు. అరికాళ్ల నుంచి రక్తం వస్తోందని అన్నాడు. దీంతో చెప్పులకోసం వారినీ వీరినీ అడుగుతూ అతను ప్రాధేయపడ్డ తీరు అక్కడి వారిని కలచివేసింది. దారి మధ్యలో కొందరు అన్నం, నీళ్లు అందిస్తున్నారని, అయితే, తన కాళ్లకు చెప్పులు లేవని, దాని వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నానని తెలిపాడు.
చెప్పులు అడిగితే కొందరు కొనుక్కోవాలని డబ్బులు ఇవ్వబోయారని, అయితే, దుకాణాలు బంద్ ఉన్నాయని ఎక్కడ కొనుక్కోవాలని ప్రశ్నిస్తూ ఆయన డబ్బులు తీసుకోలేదు. చివరకు ఓ వృద్ధులు లక్నో శివారులో ఓ షాపు నుంచి చెప్పులు కొని తిలోకి కుమార్తో పాటు వలస కార్మికులందరికీ అందించారు.