Jitender Reddy: హైదరాబాదులో ఏపీ ప్రజలు ఎక్కువగా ఉంటారు.. అందుకే కేసీఆర్ నోరు మెదపడం లేదు: జితేందర్ రెడ్డి

  • ఏపీ ప్రజల ఓట్ల కోసం మౌనంగా ఉంటున్నారు
  • కుటుంబం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు
  • మోదీ దృష్టికి తీసుకెళ్తాం
Jitender Reddy fires on KCR

శ్రీశైలం జలాలను పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి తీసుకెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో... రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నందువల్లే కేసీఆర్ ఈ అంశంపై నోరు మెదపడం లేదని బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాదులో ఏపీ ప్రజలు ఎక్కువగా ఉంటారని... వారి ఓట్ల కోసమే కేసీఆర్ మౌనంగా ఉన్నారని దుయ్యబట్టారు. మహబూబ్ నగర్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

గతంలో రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కుల నీటిని తీసుకెళ్తే కేసీఆర్ మండిపడ్డారని... ఇప్పుడు జగన్ 88 వేల క్యూసెక్కుల నీటిని తరలించేందుకు జీవోను విడుదల చేస్తే ఎందుకు మౌనంగా ఉన్నారని జితేందర్ రెడ్డి ప్రశ్నించారు. కుటుంబ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను కేసీఆర్ తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని పార్టీ తరపున తాము ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళతామని చెప్పారు.

More Telugu News