Triple Combination: కరోనాపై ప్రభావవంతంగా పనిచేస్తున్న మూడు మందుల కాంబినేషన్!: హాంకాంగ్ పరిశోధకుల వెల్లడి

  • కరోనా వ్యాక్సిన్, ఔషధాల కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలు
  • నూతన చికిత్స విధానం ఆవిష్కరించిన హాంకాంగ్ పరిశోధకులు
  • శరీరంలో వైరల్ లోడ్ తగ్గించేలా మందుల వాడకం
University of Hong Kong researchers says triple combination of anti viral drugs gives good result

అత్యంత ప్రమాదకర కరోనా వైరస్ ను రూపుమాపేందుకు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. వేల కోట్ల వ్యయంతో ప్రయోగశాలల్లో వ్యాక్సిన్లు, సమర్థ ఔషధాల కోసం ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హాంకాంగ్ యూనివర్సిటీ పరిశోధకులు ఆసక్తికర అంశం వెల్లడించారు. మూడు రకాల మందుల కాంబినేషన్ ను కరోనా చికిత్సలో వాడితే, సత్ఫలితాలు కనిపిస్తున్నాయని తెలిపారు.

యాంటీ వైరల్ థెరపీలో భాగంగా కరోనా రోగులకు ఇంటర్ ఫెరాన్ బీటా-1బీతో పాటు లోపినవివర్-రిటోనవిర్, రైబావిరిన్ ఔషధాలను రెండు వారాల పాటు ఇచ్చినట్టయితే శరీరంలో వైరస్ ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయినట్టు పరిశోధకులు తెలిపారు. కేవలం లోపినవిర్-రిటోనవిర్ మాత్రమే ఇచ్చినప్పుడు ఏమంత సమర్థంగా పనిచేయలేదని, ఇతర యాంటీ వైరల్ మందులు కూడా జతచేసినప్పుడు ఫలితాలు ఆశాజనకంగా వచ్చాయని హాంకాంగ్ యూనివర్సిటీకి చెందిన ఆ పరిశోధకులు వివరించారు.

సింగిల్ డ్రగ్ ట్రీట్ మెంట్ కంటే కాంబినేషన్ లో యాంటీవైరల్ డ్రగ్స్ ఇవ్వడం ద్వారా అధిక ప్రభావం కనిపిస్తోందని, అయితే, రోగులు కరోనా లక్షణాలు కనిపించిన వారంలోపే ఆసుపత్రిలో చేరినప్పుడే ఈ ట్రిపుల్ కాంబినేషన్ మందులు శక్తిమంతంగా పనిచేస్తాయని తెలిపారు. ఈ మూడు మందుల వాడకంతో రోగులు ఎక్కువ రోజుల పాటు ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం కూడా తగ్గుతుందని, వారిలో వైరల్ లోడ్ కొన్నిరోజుల్లోనే కనిష్ట స్థాయికి చేరుతుందని హాంకాంగ్ యూనివర్సిటీకి చెందిన క్వోక్ యుంగ్ యువెన్ వెల్లడించారు. ఈ విధమైన ట్రిపుల్ డ్రగ్ కాంబినేషన్ ను రోగులు బాగానే తట్టుకుంటారని, ఇది సురక్షితమైన వైద్య విధానం అని చెప్పారు.

More Telugu News