America: హైడ్రాక్సీ క్లోరోక్విన్ వల్ల పెద్దగా ఉపయోగం లేదంటున్న తాజా అధ్యయనం!

  • కరోనా చికిత్సలో ఉపయోగిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్
  • ఈ ఔషధం వల్ల మరణాలు కూడా సంభవిస్తున్నాయన్న అధ్యయనం
  • ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్న నిపుణులు
There is no use to use Hydroxychloroquine

కరోనా వైరస్ సోకిన వారికి చికిత్స కోసం ఉపయోగిస్తున్న మలేరియా మందు హైడ్రాక్సీ క్లోరోక్విన్ వల్ల పెద్దగా ఉపయోగం లేదని తాజా అధ్యయనం ఒకటి తేల్చి చెప్పింది. ఈ అధ్యయనంలో వెల్లడైన విషయాలు అందరినీ షాక్‌కు గురిచేస్తున్నాయి. ఈ ఔషధాన్ని ఉపయోగించడం వల్ల ఫలితం లేకపోగా ప్రాణనష్టం కూడా వాటిల్లుతున్నట్టు అధ్యయనం పేర్కొన్న వివరాలను మెడికల్ ప్రీప్రింట్ సైట్‌లో పొందుపరిచారు.

కరోనాను ఎదుర్కొనేందుకు ఈ మందు బాగా పనిచేస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇటీవల పలుమార్లు పేర్కొన్నారు. అయితే, తాజా అధ్యయనంలో వెల్లడైన విషయాలతో ఈ ఔషధంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో కరోనా బారినపడి మరణించిన వారు, డిశ్చార్జ్ అయిన 368 మంది సీనియర్ సిటిజన్ల వైద్య రికార్డులను పరిశీలించిన అనంతరం అధ్యయనకారులు ఈ విషయాన్ని వెల్లడించారు.  

కరోనా బారినపడి హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను తీసుకున్న రోగుల్లో మరణాల రేటు 28 శాతం ఉండగా, యాంటీబయాటిక్ అజిత్రోమైసిన్‌తో కలిపి ఈ మందును తీసుకున్న వారిలో మరణాల రేటు 22 శాతంగా ఉన్నట్టు తేలింది. అయితే, ప్రామాణిక వైద్యం పొందిన వారిలో మాత్రం మరణాల రేటు 11 శాతం మాత్రమే ఉండడం గమనార్హం.

ఫ్రెంచ్ శాస్త్రవేత్త దీదీర్ రౌల్ట్ కూడా ఈ డ్రగ్ కాంబినేషన్ వైరస్‌పై సమర్థంగా పోరాడుతుందని చెప్పడంతో ఈ ఔషధంపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. అయితే, అధ్యయనం కోసం ఎంచుకున్న రోగులందరూ సీనియర్ సిటిజన్లు కావడం, వారు అప్పటికే మధుమేహం, రక్తపోటు వంటి జబ్బులతో బాధపడుతుండడంతో ఈ అధ్యయనంపై కంగారుపడాల్సిందేమీ లేదన్న వాదన కూడా వినిపిస్తోంది.

More Telugu News