Arvind Kejriwal: లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు ఇవ్వం: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్

  • ఢిల్లీలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి
  • టెస్టింగ్‌ల సంఖ్యను పెంచాము
  • ఢిల్లీని సురక్షిత ప్రాంతంగా ఉంచడమే మా లక్ష్యం
No Relaxation Of Lockdown In Delhi Review After A Week Says Chief Minister Arvind Kejriwal

దేశంలోని జనాభాలో దాదాపు 2 శాతం మంది ఢిల్లీలో ఉంటారని, అయితే, దేశంలోని కరోనా వైరస్ బాధితుల్లో 12 శాతం మంది ఢిల్లీలోనే ఉన్నారని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తెలిపారు. కరోనా విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌కు రేపటి నుంచి కేంద్ర ప్రభుత్వం పలు సడలింపులు ఇస్తున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌ ఈ రోజు మీడియాతో మాట్లాడారు. ఢిల్లీని సురక్షిత ప్రాంతంగా ఉంచడమే తమ లక్ష్యమని అందుకోసమే పని చేస్తామని చెప్పారు. అందుకోసం తాము లాక్‌డౌన్‌ నుంచి ఎలాంటి మినహాయింపులు, సడలింపులు ఇవ్వట్లేదని తెలిపారు.

ఈ విషయంపై తాము వారం రోజుల తర్వాత కరోనా పరిస్థితిని సమీక్షించి తమ తదుపరి నిర్ణయం తీసుకుంటామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ప్రజలంతా సామాజిక దూరం నిబంధనలను పాటించాలని ఆయన కోరారు. 'కేంద్ర ప్రభుత్వం మార్గ దర్శకాల ప్రకారం ఏప్రిల్‌ 20 నుంచి  దేశ వ్యాప్తంగా రెడ్‌జోన్లుగా ప్రకటించని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ సడలింపులు అమల్లోకి వస్తాయి.

అంతేగానీ, కట్టడి ప్రాంతాల్లో మాత్రం సడలింపులు ఉండవు. ఢిల్లీలో 11 జిల్లాలు ఉన్నాయి. అవన్నీ హాట్‌స్పాట్‌ ప్రాంతాలే. కొన్ని రోజులుగా మేము టెస్టుల సంఖ్యను పెంచాము. కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది' అని చెప్పారు. కాగా ఢిల్లీలో మొత్తం 77 కట్టడి ప్రాంతాలున్నాయి. ఇప్పటివరకు 1893 మందికి కరోనా సోకింది. వారిలో 42 మంది ప్రాణాలు కోల్పోయారు. 

More Telugu News