Fox News: కరోనా వైరస్ ఎక్కడ, ఎలా పుట్టిందో సంచలన కథనం వెలువరించిన 'ఫ్యాక్స్ న్యూస్'!

  • వుహాన్ లోని ఓ ల్యాబ్ కరోనా వైరస్ కు జన్మస్థానమన్న ఫాక్స్
  • గబ్బిలాలపై పరిశోధనలు చేస్తుండగా మహిళకు వైరస్ సోకినట్టు వెల్లడి
  • ఆమె బాయ్ ఫ్రెండ్ ద్వారా ఇతరులకు వ్యాపించినట్టు వివరణ
Fox News tells lab in Wuhan birthplace for corona

ప్రపంచంలో ఏ మూల చూసినా కరోనా గురించి చర్చ తప్ప మరో అజెండా లేదు. ఇంచుమించు ప్రతి దేశం కరోనాతో విలవిల్లాడుతోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ మహమ్మారి అగ్రరాజ్యాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ లను అతలాకుతలం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షకు పైగా మరణాలు సంభవించాయి. అయితే ఇప్పటివరకు ఈ వైరస్ పుట్టుకపై విశ్వసనీయ సమాచారం లేదు. చైనాలోని వుహాన్ నగరంలో ఉన్న ఓ మాంసాహార విపణిలో ఈ వైరస్ ఉద్భవించిందని, అక్కడి నుంచి ఇది వ్యాపించిందని ఇప్పటివరకు భావిస్తున్నారు.

తాజాగా అంతర్జాతీయ మీడియా సంస్థ ఫాక్స్ న్యూస్ సంచలన కథనం వెలువరించింది. ఈ ప్రాణాంతక వైరస్ వుహాన్ లోని ఓ ప్రయోగశాలలో పుట్టిందని ఫాక్స్ న్యూస్ పేర్కొంది. వైరస్ లకు ఆవాసంగా ఉండే గబ్బిలాలపై ఓ ల్యాబ్ లో ప్రయోగాలు నిర్వహిస్తుండగా, అక్కడ పనిచేసే ఓ మహిళకు కరోనా వైరస్ సోకిందని, ఆమె ద్వారా ఇతరులకు వ్యాపించిందని వెల్లడించింది. ఇది చైనా తయారుచేసిన జీవాయుధం కాదని, ఓ ల్యాబ్ లో పుట్టిన మృత్యుకారక వైరస్ అని అభివర్ణించింది.

అయితే, ఈ వైరస్ ల్యాబ్ లో జన్మించిందన్న విషయాన్ని కప్పిపుచ్చేందుకు చైనా ప్రయత్నాలు చేసిందని, ఓ మాంసాహార మార్కెట్ ద్వారా వ్యాపించిందని చెప్పడం అందులో భాగమేనని ఫాక్స్ న్యూస్ వివరించింది. అంతేకాదు, ఈ కథనం వెనుక జరిగిన పాత్రికేయ పరిశోధన వివరాలను ఫాక్స్ న్యూస్ ప్రతినిధి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వివరించారు.

కరోనా వైరస్ అనేక వన్యప్రాణుల్లో ఉండడం సహజమని, అయితే, వుహాన్ లోని ఓ ల్యాబ్ లో సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఆ వైరస్ అక్కడ పనిచేసే మహిళకు సోకిందని తెలిపారు. ఆమె తన స్నేహితుడ్ని కలవడం, అతను మార్కెట్ ను సందర్శించడం, ఇలా కరోనా వైరస్ మహమ్మారి చైనా మీదుగా ప్రపంచవ్యాప్తమైందని సదరు ప్రతినిధి ట్రంప్ తో చెప్పారు. అయితే, ట్రంప్ ఈ విషయంపై ఆచితూచి స్పందించారు. ఇలాంటివే మున్ముందు మరిన్ని కథనాలు వినాల్సి వస్తుంది, చూడాల్సి వస్తుంది అంటూ వ్యాఖ్యానించారు.

More Telugu News