Tablighi Jamaat: తబ్లిగీ జమాత్ చీఫ్ పై మనీలాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ

ED files case on Maulana Saad
షార్ట్స్‌లో చూడండి
కరోనా కల్లోలాన్ని లక్ష్యపెట్టకుండా ఢిల్లీలో మతపరమైన సమావేశం నిర్వహించారంటూ తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా మహ్మద్ సాద్ ఖందాల్వీపై ఇప్పటికే హత్యానేరం కేసు నమోదైంది. తాజాగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంది. సాద్ ఖందాల్వీపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఢిల్లీలోని మర్కజ్ కు అందే నిధులపై ఈడీ దర్యాప్తు చేయనుంది.

మర్కజ్ కు భారత్ నుంచి, విదేశాల నుంచి నిధులు వచ్చే అన్ని మార్గాలను ఈడీ కూపీ లాగనుంది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇప్పటికే సాద్ ఖందాల్వీ, మరో ఐదుగురిపైనా '1897 అంటువ్యాధుల చట్టం' కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అటు ప్రత్యేకంగా సాద్ ఖందాల్వీపై ఢిల్లీ పోలీసులు శిక్షించదగిన హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. తాజాగా ఈడీ కూడా రంగంలోకి దిగడంతో ఖందాల్వీ ఇప్పట్లో బయటపడడం అసాధ్యంగా కనిపిస్తోంది.

మర్కజ్ కు వచ్చిన నిధులు హవాలా మార్గాలు, నాన్ బ్యాంకింగ్ విధానాల ద్వారా వచ్చాయా? అనే కోణంలో ఈడీ దర్యాప్తు సాగనుంది. ఈ కేసుకు సంబంధించి సాద్ కు, ఆయన అనుయాయులకు త్వరలోనే సమన్లు పంపుతామని ఈడీ వర్గాలు తెలిపాయి. అటు, ఢిల్లీకి చెందిన అధికార వర్గాలు త్వరలోనే సాద్ పై ఆదాయపన్ను విభాగం కూడా దృష్టి సారించే అవకాశాలున్నాయని తెలిపాయి.  
Go Back to Shorts
Tablighi Jamaat
Saad
ED
Corona Virus
New Delhi
Nizamuddin Markaz

More Telugu News