Bradd Hogg: విమానం ఎక్కేముందే ఆటగాళ్లకు కరోనా పరీక్షలు చేయాలంటున్న ఆసీస్ మాజీ క్రికెటర్

  • టి20 వరల్డ్ కప్ కు ఆతిథ్యమివ్వనున్న ఆస్ట్రేలియా
  • కరోనా ప్రభావంతో టోర్నీపై నీలి నీడలు
  • టోర్నీ రద్దుకు తాను వ్యతిరేకం అంటున్న బ్రాడ్ హాగ్
  • ఆటగాళ్లను చార్టర్డ్ విమానాల్లో తీసుకురావాలని సూచన
Aussies former cricketer Brad Hogg suggests corona tests for players before boarding

కరోనా వైరస్ వ్యాప్తి ఇప్పట్లో సమసిపోయేట్టు కనిపించడంలేదు. దాంతో ఆస్ట్రేలియాలో జరగాల్సిన టి20 వరల్డ్ కప్ పైనా అనుమాన మేఘాలు ముసురుకుంటున్నాయి. ఆస్ట్రేలియా ఆతిథ్యమిచ్చే ఈ భారీ ఐసీసీ టోర్నీ అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకు జరగాల్సి ఉంది. అయితే అప్పటికి కరోనా సద్దుమణుగుతుందో లేదో చెప్పలేని పరిస్థితి ఉండడంతో, ఎవరికి తోచినట్టు వాళ్లు ఊహాగానాలు చేస్తున్నారు. తాజాగా, ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ స్పందిస్తూ, టి20 వరల్డ్ కప్ ను పటిష్ట చర్యల నడుమ నిర్వహించాలని అంటున్నాడు.

అన్ని జట్లను ఓ నెల ముందుగానే చార్టర్డ్ విమానాల్లో ఆస్ట్రేలియాకు తీసుకురావాలని, విమానం ఎక్కకముందే ఆటగాళ్లకు కరోనా పరీక్షలు నిర్వహించాలని సూచిస్తున్నాడు. టోర్నీని వాయిదా వేయడం, రద్దు చేయడం అనే ఆలోచనలకు తాను పూర్తిగా వ్యతిరేకమని, టోర్నీ సాఫీగా జరిగేలా చూసేందుకు కొన్ని రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నాడు.

"క్రికెట్ రంగంలో భౌతిక దూరం పాటించడం పెద్ద కష్టమేమీ కాదు. సాధారణ పరిస్థితుల్లో ఆటగాళ్ల మధ్య దూరం ఎప్పుడూ మీటరు, మీటరున్నర ఉంటుంది. సమస్యంతా స్లిప్ మోహరింపులోనే. వారికి కూడా ఓ నిబంధన విధించాలి. విధిగా ప్రతి స్లిప్ ఫీల్డర్ రెండు మీటర్ల ఎడం పాటించాలి. క్రికెట్ ను లైవ్ యాక్షన్ లో చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు తహతహలాడుతుంటే టోర్నీని వాయిదా వేయడం ఎందుకు?" అంటూ హాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

More Telugu News