తిరుమల ఆలయాన్ని మూసివేశారన్న దుష్ఫ్రచారాన్ని నమ్మొద్దు: టీటీడీ ఈవో సింఘాల్

05-04-2020 Sun 20:44
  • సామాజిక మాధ్యమాలు వేదికగా వదంతులు సృష్టిస్తున్నారు
  • ఇలా దుష్ప్రచారం చేసే వారు చట్ట రీత్యా శిక్షార్హులు
  • పెద్ద జీయర్ స్వామి ఆధ్వర్యంలో స్వామికి  అన్ని సేవలు జరుగుతున్నాయి
TTD EO Singhal says do not believe rumours about Tirumala temple

కొన్ని వేల సంవత్సరాల అనంతరం తిరుమల ఆలయాన్ని మూసివేశారంటూ వస్తున్న వదంతులను, జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో అనిల్ కుమార్ సింఘాల్  ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

తిరుమలలో ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2500 సంవత్సరాల తర్వాత  శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని మూసివేశారంటూ సామాజిక మాధ్యమాల వేదికగా వస్తున్న వదంతులను నమ్మొద్దని కోరారు. పెద్ద జీయర్ స్వామి ఆధ్వర్యంలో స్వామి వారికి ఉదయం సుప్రభాతం నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు అన్ని కైంకర్యాలు ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతున్నాయని స్పష్టం చేశారు.

 నిత్యం స్వామి వారి కల్యాణాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని చెప్పారు.  వసంతోత్సవాల సందర్భంగా ఇవాళ ఉదయం మొదటి గంట నైవేద్యం, రెండో గంట నైవేద్యం వెంటవెంటనే పెట్టారని, ‘ఇది అపచారం’ అంటూ సామాజిక మాధ్యమాల్లో వదంతులు సృష్టిస్తున్నారని, ఇలాంటివి నమ్మొద్దని సూచించారు. ఇలా దుష్ప్రచారం చేసే వారు చట్ట రీత్యా శిక్షార్హులు అని హెచ్చరించారు.