Chiranjeevi: కొంతకాలం పాటు ఇదే విధానాన్ని ఆచరిస్తా: చిరంజీవి

Chiranjeevi tells about his daily routine during lock down
  • డ్రైవర్లు, పీఏలకు సెలవు ప్రకటించినట్టు వెల్లడి
  • ఇంట్లో కొందరు పనివాళ్లు తమతోనే ఉంటున్నారన్న చిరు
  • కొత్త సినిమాలు, పుస్తకాలతో టైమ్ పాస్ చేస్తున్నట్టు వివరణ
భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తిని ఆదిలోనే గుర్తించి వెంటనే తన సినిమా షూటింగ్ ను నిలిపివేసిన మెగాస్టార్ చిరంజీవి దానిపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో కరోనా గురించి విన్న తర్వాత ఇది ఎప్పుడూ చూడని విపత్తు అనిపించిందని, అందుకే సెట్స్ మీద  దర్శకుడు కొరటాల శివ, నటుడు సోనూసూద్ లతో ఈ విషయం గురించి చర్చించేవాడ్నని గుర్తుచేసుకున్నారు.

అదే సమయంలో మంత్రి కేటీఆర్ కూడా ఎక్కువమంది ఒకేచోట గుమికూడవద్దని చెబుతుండడంతో ఇక 'ఆచార్య' సినిమా షూటింగ్ వాయిదా వేయడమే మంచిదని నిర్ణయానికొచ్చి అదే విషయం కొరటాల శివకు కూడా చెబితే చిత్రీకరణ నిలిపివేశారని తెలిపారు. ఆ తర్వాత రెండ్రోజులకే ఇండస్ట్రీలో షూటింగులు, చిత్ర ప్రదర్శనలు అన్నీ నిలిపివేశారని పేర్కొన్నారు.

ఇక, కరోనా కారణంగా తాను ఇంటికే పరిమితం కావడం పట్ల కూడా చిరంజీవి వివరించారు. లాక్ డౌన్ ప్రకటించాక తన డ్రైవర్లు, అసిస్టెంట్లు, బయటి నుంచి వచ్చే తమ పనిమనుషులు అందరికీ సెలవు ప్రకటించానని వెల్లడించారు. అయితే కొందరు వంటవాళ్లు, పనివాళ్లు, సహాయకులు ఎప్పటినుంచో తమ ఇంట్లోనే ఉంటున్నారని, వారందరూ కూడా తమతో పాటే స్వీయ నిర్బంధంలో ఉన్నారని చిరు తెలిపారు. కరోనా ముప్పు తొలగిపోయాక కూడా కొంతకాలం పాటు ఇదే విధానం ఆచరిస్తానని స్పష్టం చేశారు.

కరోనా లాక్ డౌన్ కారణంగా తన ఇల్లు సందడిగా మారిందని, ఇద్దరు కుమార్తెలు, చెల్లెళ్లు కూడా వారి కుటుంబాలతో తన ఇంట్లోనే ఉంటున్నారని చెప్పారు. కొత్త సినిమాలు చూస్తూ, పుస్తకాలు చదువుతూ సమయాన్ని గడుపుతున్నానని, స్విమ్మింగ్ పూల్ శుభ్రపరచడం, తోట పనితో సమయం తెలియడంలేదని వివరించారు.
Chiranjeevi
Lockdown
Corona Virus
India
Tollywood

More Telugu News