Corona Virus: కరోనా సోకిందన్న ప్రచారంతో ఆత్మహత్య... పరీక్ష చేస్తే నెగెటివ్ వచ్చింది!

  • మధురై నుంచి కేరళ వలస వెళ్లిన వ్యక్తి
  • లాక్ డౌన్ తో స్వస్థలం చేరిక
  • కరోనా లక్షణాలున్నాయంటూ ఆసుపత్రికి తరలించిన స్థానికులు
  • మనస్తాపంతో రైలు కింద పడిన కూలీ
Man commits suicide in the wake of false campaign

కరోనా వైరస్ భూతం విజృంభిస్తోన్న తరుణంలో సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ప్రచారం జరుగుతోంది. ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో తెలియనంతగా ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే ఓ అసత్య ప్రచారం అమాయకుడి ప్రాణం తీసింది.

వివరాల్లోకి వెళితే, మధురైకి చెందిన ముస్తఫా (35) కేరళలో కూలీగా పనిచేస్తున్నాడు. కరోనా లాక్ డౌన్ తర్వాత కుటుంబంతో సహా మధురైలో ఉన్న తల్లివద్దకు వచ్చాడు. అతనికి కరోనా లక్షణాలు ఉన్నాయంటూ స్థానికులు పుకారు పెట్టి, అధికారులకు ఫోన్ చేశారు. అంబులెన్స్ వచ్చేందుకు ఆలస్యం కావడంతో అక్కడివారే ఓ వాహనంలో అతడిని ఆసుపత్రికి తరలించారు.

ఆ కూలీ నుంచి శాంపిల్స్ సేకరించిన ఆసుపత్రి వర్గాలు ల్యాబ్ కు పంపాయి. అయితే, ల్యాబ్ రిపోర్టు వచ్చేసరికే దారుణం జరిగింది. అతడిని బలవంతంగా వాహనంలో ఆసుపత్రికి తరలిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తనను ఒక కరోనా రోగిగా ప్రచారం చేయడం పట్ల ముస్తఫా మనోవేదనకు గురయ్యాడు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, కరోనా పరీక్షలో నెగెటివ్ రావడంతో అతడి కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. స్థానికుల దూషణల వల్లే ముస్తఫా ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

More Telugu News