PV Sindhu: అచ్చం ఆ సినిమా మాదిరే ఉంది ఇప్పుడు ప్రపంచం పరిస్థితి: పీవీ సింధు

Everyone around the world is getting affected by a virus now like that movie says PV Sindhu
  • ఆటలు ఆగిపోవడంతో నేనిప్పుడు ఇంట్లోనే ఉంటున్నా
  • చాలా సినిమాలు చూస్తున్నా.. వాటి పేర్లు కూడా నాకు గుర్తు లేదు
  • ఇంత పెద్ద విరామం ఎప్పుడూ తీసుకోలేదంటున్న స్టార్ షట్లర్
నెలలో మూడు, నాలుగు టోర్నమెంట్లు.. రోజూ ఉదయం, సాయంత్రం ప్రాక్టీస్‌తో ఎప్పుడూ  బిజీగా ఉండే  భారత బ్యాడ్మింటన్ అగ్ర క్రీడాకారిణి పీవీ సింధు  ఇప్పుడు అందరిలాగే ఇంటికే పరిమితమైంది. ఆల్ ఇంగ్లండ్ టోర్నమెంట్ కోసం  ఇంగ్లండ్ వెళ్లొచ్చిన సింధు 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉంది. ఆ గడువు ఈ మధ్యే ముగిసినా  తాను ఇంటి నుంచి అస్సలు బయటకు రావడం లేదని సింధు చెప్పింది.  చివరగా నేను ఇంత సుదీర్ఘ విరామం  ఎప్పుడు తీసుకున్నానో  తనకు గుర్తు లేదంటోంది.

‘ఇంగ్లండ్ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లోనే ఉంటున్నా. నా గదిలోనే ఎక్కువగా టీవీ చూస్తూ  ఈ విరామాన్ని ఆస్వాదిస్తున్నా.  ఉదయం  ఆలస్యంగా లేవడం.. కొద్దిసేపు వర్కౌట్ చేసి టీవీ ముందు వాలిపోతున్నా. కాసేపు విశ్రాంతి తీసుకొని మా అక్క కొడుకుతో మాట్లాడుతున్నా. ఆ తర్వాత మళ్లీ టీవీ చూస్తున్నా. ఇదే నా దినచర్య. ఈ విరామంలో నేను చాలా  సినిమాలు చూశా. వాటిలో చాలా సినిమాల పేర్లు నాకు గుర్తు కూడా లేవు. తెలుగు, హిందీ తోపాటు ఇంగ్లీష్ సినిమాలు ఎంపిక చేసుకొని చూస్తున్నా. ఈ  మధ్యే ‘కంటేజన్’ అనే సినిమా చూశా. అందులో వైరస్ బారిన పడి ఒకరి తర్వాత ఒకరు అందరూ చనిపోతారు. ఇప్పుడు ప్రపంచం పరిస్థితి  కూడా అచ్చం అలానే ఉంది’ అని వివరించింది.

దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ మరికొంతకాలం పొడిగించే అవకాశం ఉందని సింధు అభిప్రాయపడింది. అయితే, పరిస్థితి తొందర్లోనే అదుపులోకి వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేసింది.
PV Sindhu
Lockdown
Quarantine
movies

More Telugu News