Hrithi Roshan: ముంబయి పోలీస్ ట్వీట్ పై బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • ‘ఫూల్’ పద ప్రయోగంతో ముంబయి పోలీస్ ట్వీట్
  • ఆ పోస్ట్ లో వాక్యాలను జూమ్ చేసి చూస్తే ఆసక్తికర సూచన
  • తీవ్రమైన సమస్యలను సైతం హాస్యం జోడించి చెప్పొచ్చా అంటూ హృతిక్ స్పందన
Hero Hrithik Roshan reacts on Mumbai police tweet

ఇవాళ్టి నుంచి ఏప్రిల్ నెల మొదలైంది. ‘ఏప్రిల్’ అనగానే పిల్లలు సహా పెద్దలకు గుర్తుకు వచ్చే పదం ‘ఫూల్’. ఈ నెల మొదటి రోజున.. లేనిది ఉన్నట్టుగా చెప్పి అవతలి వ్యక్తిని నమ్మించే ప్రయత్నం చేసి, ఒకవేళ ఆ వ్యక్తి నమ్మితే  ‘ఏప్రిల్ ఫూల్’ అంటూ వారిని ఆట పట్టించడం పరిపాటి.

ఇదిలా ఉండగా, ప్రస్తుతం కరోనా వైరస్ వణికిస్తున్న నేపథ్యంలో ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తల గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పలు శాఖలు ఏకరవు పెడుతున్నాయి. ఈ క్రమంలో ప్రజలను చైతన్య పరిచేందుకు ముంబయి పోలీస్ కూడా ఓ వినూత్న ఆలోచనతో హాస్యం పుట్టుకొచ్చే ఓ పోస్ట్ ను తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈరోజు షేర్ చేసింది.

‘మీ కోసం ఓ రహస్య సమాచారం’ అంటూ ఆ సమాచారం చూడాలంటే ‘జూమ్ ఇన్’ చేయాలంటూ ఆ పోస్ట్ లోనే చిన్న అక్షరాలతో మూడు లైన్ల మెస్సేజ్ ను ముంబయి పోలీస్ తన పోస్ట్ లో పేర్కొంది. ఆ వాక్యాలను పెద్దవి చేసి చూస్తే.. 'మరీ దగ్గరగా ఉండకండి.. ఫూల్ అవ్వకండి ..సామాజిక దూరం (సోషల్ డిస్టెన్స్) పాటించండి' అనే సందేశాన్ని హాస్యయుక్తంగా చెప్పడం కనబడుతుంది.

ఆ పోస్ట్ పై ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ స్పందించాడు. ఈ పోస్ట్ చాలా వినూత్నంగా ఉందని, తీవ్రమైన సమస్యలను సైతం కొద్దిపాటి హాస్యం జోడించి చెప్పవచ్చన్న విషయాన్నిగుర్తు చేస్తోందని బదులిచ్చాడు.

More Telugu News