Corona Virus: కనిపిస్తున్న లాక్‌డౌన్ ప్రభావం.. తగ్గుతున్న కరోనా కేసుల పెరుగుదల నిష్పత్తి

  • కొత్త కేసులు తగ్గకున్నా పెరుగుదల నిష్పత్తి తగ్గింది
  • ఎలా సోకిందో తెలియనంత మాత్రాన సామాజిక వ్యాప్తి కాదు
  •  ప్రభుత్వ మార్గదర్శకాలు అమలు చేయకుంటే మాత్రం ప్రమాదమే
Increasing ratio of declining corona cases amid lockdown

దేశంలో లాక్‌డౌన్ వల్ల ఫలితాలు కనిపిస్తున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ప్రజలు పాటిస్తున్న సామాజిక దూరం వల్ల రోగుల సంఖ్య తగ్గకపోయినా, పెరుగుదల నిష్పత్తి మాత్రం తగ్గుతోందని అన్నారు. అయినప్పటికీ ఈ విషయంలో ఉదాసీనత అస్సలు పనికిరాదని అన్నారు. దేశంలో కొందరు రోగులకు ఆ వైరస్ ఎక్కడి నుంచి సోకిందో తెలియడం లేదని, అంతమాత్రాన దానిని సామాజిక వ్యాప్తిగా ప్రచారం చేయడం తగదని అన్నారు.

ప్రభుత్వ మార్గదర్శకాలను అమలు చేయకుంటే మాత్రం సామాజిక వ్యాప్తి తప్పదని హెచ్చరించారు. ఇంట్లో పెద్దవాళ్లతోనూ కనీసం మూడు అడుగుల దూరంలో ఉండి మాట్లాడాలని ఐసీఎంఆర్ శాస్త్రవేత్త రమణ్ ఆర్. గంగాఖేడ్కర్ సూచించారు. కాగా, నిన్న రాత్రి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించిన గణాంకాల ప్రకారం.. దేశంలో ఇప్పటి వరకు 16 మంది ప్రాణాలు కోల్పోయారు. 694 మంది కరోనాతో బాధపడుతున్నారు. నిన్న ఒక్క రోజులోనే 90 కేసులు నమోదు కావడం గమనార్హం.

More Telugu News