Corona Virus: తెలంగాణలో 45కు చేరుకున్న కరోనా బాధితుల సంఖ్య

The number of corona victims reached 45 in Telangana
  • తెలంగాణలో మరో నలుగురికి సోకిన వైరస్
  • విదేశీ ప్రయాణాలు చేయకున్నా సోకిన కరోనా
  • నలుగురూ హైదరాబాద్ వాసులే
తెలంగాణలో నిన్న మరో నలుగురికి కరోనా సోకింది. వీరు ఇటీవల కాలంలో విదేశీ ప్రయాణం చేయలేదని తేలింది. అయితే, ఢిల్లీ, తిరుపతి వెళ్లొచ్చిన తర్వాత వీరిలో ఈ లక్షణాలు కనిపించినట్టు వైద్యాధికారులు తెలిపారు. తాజా కేసులతో తెలంగాణలో మొత్తం రోగుల సంఖ్య 45కు చేరుకుంది. తాజాగా సోకిన నలుగురినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నలుగురితో ఇప్పటి వరకు సన్నిహితంగా ఉన్న వారిని కూడా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణలో నమోదైన 45 కేసుల్లోనూ విదేశాల నుంచి వచ్చిన వారు, వారితో సన్నిహితంగా ఉన్నవారు మాత్రమే ఉన్నారు.

తాజాగా, నమోదైన నలుగురిలో ఒకరు మేడ్చల్ జిల్లాలోని కుత్బుల్లాపూర్‌ వ్యక్తి. ఈ నెల 14న రైలులో ఢిల్లీ వెళ్లి 18న సికింద్రాబాద్ చేరుకున్నాడు. మరో రెండు కేసుల్లో వైద్యుడు, ఆయన భార్య ఉన్నారు. 14 నుంచి 16 వరకు సెలవులో ఉన్న వీరిద్దరూ 17న విమానంలో తిరుపతి వెళ్లి మళ్లీ అదే రోజు తిరిగొచ్చారు. 18, 19 తేదీల్లో ఇంటి పట్టునే ఉన్నారు. 24న వీరు పరీక్షలు చేయించుకోగా కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. చివరి వ్యక్తి బుద్ధనగర్ వాసి. ఆయన కూడా ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాతే కరోనా సోకినట్టు తేలింది.
Corona Virus
Hyderabad
Telangana

More Telugu News