అమెరికాలో ఉద్యోగం అంటూ మోసం...అసలు విషయం తెలిసి వధువు ఆత్మహత్య!

23-03-2020 Mon 10:35
  • పెళ్లయిన వారానికి బలవన్మరణం 
  • పెద్ద ఉద్యోగం అంటూ అబద్ధాలు   
  • విషయం తెలిశాక మనస్తాపం
bride suicide in suryapet district

అమెరికాలో ఉద్యోగం...భారీగా భూములు...ఆస్తిపాస్తులకు లోటు లేదంటూ అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకున్న వ్యక్తి అసలు రంగు అత్తింటికి వెళ్లాక తెలియడంతో మనస్తాపంతో నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. భర్త మోసాన్ని లేఖద్వారా తెలియజేస్తూ పెళ్లయిన వారం రోజులకే బలవన్మరణానికి పాల్పడింది.

పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు...సూర్యాపేట పట్టణంలోని కుడకుడ, వినాయకనగర్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు సామ ఇంద్రారెడ్డి కుమార్తె మౌనికారెడ్డి (25)కి, హైదరాబాద్ ఈసీఎల్ కు చెందిన బద్దం శ్రీనివాసరెడ్డి కుమారుడు సాయికిరణ్ రెడ్డితో ఈనెల 15న పెళ్లయింది.

పెళ్లి చూపుల సమయంలో తాను అమెరికాలో ఉద్యోగం చేస్తున్నానని సాయికిరణ్ రెడ్డి చెప్పగా, తమకు బోలెడన్ని భూములు, ఆస్తిపాస్తులు ఉన్నాయని అతని అమ్మానాన్నలు తెలిపారు. మంచి ఉద్యోగం, స్థితిపరుల కుటుంబం కావడంతో తన బిడ్డ సుఖపడుతుందని భావించిన ఇంద్రారెడ్డి పెళ్లి సమయంలో రూ.10 లక్షల కట్నం, 35 తులాల బంగారం, నాలుగు కిలోల వెండి ఇచ్చారు.

పెళ్లి చేసి అత్తారింటికి పంపాక ఉగాదికి పిలుపు చేయాలని ఈ నెల 21న అల్లుడి ఇంటికి ఇంద్రారెడ్డి, మంజుల దంపతులు వెళ్లారు. ఆ సందర్భంలో అల్లుడిది విదేశాల్లో ఉద్యోగం కాదని, ఆస్తిపాస్తులు కూడా లేవని కుమార్తె చెప్పడంతో ఇంద్రారెడ్డి దంపతులు హతాశులయ్యారు. ఈ సందర్భంగా అల్లుడి కుటుంబంతో వాగ్వాదం జరగగా, కుమార్తెను తీసుకుని ఇంద్రారెడ్డి దంపతులు ఇంటికి వచ్చేశారు. అదేరోజు రాత్రి మౌనికారెడ్డి 'మనం మోసపోయాం నాన్నా' అంటూ భోరుమంది.

రాత్రికి ఎవరి గదికి వారు వెళ్లి పడుకున్నారు. నిన్న ఉదయం మౌనికారెడ్డి గది తలుపులు కొట్టగా తీయలేదు. ఎంత ప్రయత్నించినా తీయకపోవడంతో అనుమానం వచ్చి కిటికీలోంచి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కుమార్తె కనిపించడంతో ఇంద్రారెడ్డి దంపతులు కుప్పకూలిపోయారు. వెంటనే చుట్టుపక్కల వాళ్లు వచ్చి బలవంతంగా తలుపు తెరిచి మౌనికారెడ్డిని కిందకు దించినప్పటికీ అప్పటికే ఆమె చనిపోయింది. భర్త చేసిన మోసంపై నవవధువు రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.