Chicken Biryani: రూపాయికే చికెన్ బిర్యానీ.. కరోనా భయాన్ని పక్కనపెట్టి ఎగబడిన జనం!

  • కొత్తగా ప్రారంభమైన హోటల్
  • వినియోగదారులను అదుపు చేసేందుకు పోలీసుల తంటాలు
  • రెండు గంటల్లో 120 కిలోల బిర్యానీ ఖాళీ
Newly opened hotel offers chicken biryani for one rupee

చికెన్ తింటే కరోనా వైరస్ కబళిస్తుందన్న భయంతో జనం అటువైపు చూడడమే మానేశారు. ఫలితంగా చికెన్ విక్రయాలు దారుణంగా పడిపోయాయి. నష్టాల ఊబిలో చిక్కుకుపోతున్న వ్యాపారులు ఉన్నకాడికి అమ్ముకుందామని ధరలను దారుణంగా తగ్గించి విక్రయిస్తున్నారు. అయినప్పటికీ అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అయితే, తమిళనాడులోని తిరువళ్లూర్ జిల్లా పొన్నేరి ప్రజలు మాత్రం కరోనా భయాన్ని పక్కనపెట్టేసి అందినంత చికెన్ బిర్యానీ లాగించారు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. గురువారం ఇక్కడ కొత్తగా ఓ హోటల్ ప్రారంభమైంది. ప్రజలను ఆకర్షించేందుకు ప్రారంభోత్సవ ఆఫర్‌లో భాగంగా రూపాయికే చికెన్ బిర్యానీ అందిస్తున్నట్టు బోర్డులు పెట్టారు. అంతే.. జనాలు విరగబడిపోయారు. బిర్యానీని దక్కించుకునేందుకు బారులుతీరారు. వారిని అదుపు చేసేందుకు ఏకంగా పోలీసులే రంగంలోకి దిగాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇక మధ్యాహ్నం 12 గంటలకు విక్రయాలు ప్రారంభం కాగా, రెండు గంటల్లోనే 120 కిలోల చికెన్ బిర్యానీ హాంఫట్ అయిపోయింది. కరోనా భయంతో బిర్యానీ అమ్ముడుపోతుందో, లేదోనని తొలుత భయపడ్డామని, అయితే, వినియోగదారుల నుంచి విశేష స్పందన రావడం తమకు సంతోషాన్నిచ్చిందని హోటల్ యజమాని పేర్కొన్నారు.

More Telugu News