విడాకులు తీసుకున్నా వేధిస్తున్న మాజీ భర్త.. ఏకాంత సమయంలో తీసుకున్న చిత్రాలు పంపి చిత్రహింసలు!
- 11 ఏళ్ల క్రితం వివాహం.. నాలుగేళ్ల క్రితం విడాకులు
- సన్నిహితంగా ఉన్నప్పటి చిత్రాలను పంపుతూ వేధింపులు
- ఆమె కాబోయే భర్తకీ పంపి వికృతానందం
పోలీసుల కథనం ప్రకారం.. సినిమా రంగంలో స్టిల్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న యువకుడికి 11 ఏళ్ల క్రితం వివాహమైంది. పెళ్లైన కొన్ని నెలలకే భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చాయి. విషయం తెలిసిన ఇరు కుటుంబాల పెద్దలు రాజీ కుదిర్చారు. ఆ తర్వాత కొన్నాళ్లకే మళ్లీ అతడిలోని మృగాడు నిద్రలేచి చిత్రహింసలు మొదలుపెట్టాడు. భరించలేని బాధిత మహిళ పుట్టింటికి వెళ్లిపోయింది. నాలుగేళ్ల క్రితం భర్త నుంచి విడాకులు తీసుకుంది.
భర్త నుంచి విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న కుమార్తెకు మరో వివాహం చేయాలని నిర్ణయించిన తల్లిదండ్రులు ఇటీవల ఓ యువకుడితో నిశ్చితార్థం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న మాజీ భర్త మళ్లీ వేధింపులు మొదలుపెట్టాడు. పెళ్లి ఎలా చేసుకుంటావో చూస్తానంటూ, గతంలో తాము ఏకాంతంగా గడిపినప్పటి చిత్రాలను పంపడం మొదలుపెట్టాడు.
అంతేకాదు, ఆమె కాబోయే భర్త ఫోన్ నంబరు సంపాదించి అతడికీ వాటిని పంపడం మొదలుపెట్టాడు. అతడు ఈ విషయాన్ని ఆమెకు చెప్పడంతో, మాజీ భర్త అకృత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.