వేర్వేరు కేసుల్లో పోలీసుల అదుపులో ఇద్దరు ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్లు

13-02-2020 Thu 18:48
  • ఒక ప్రొఫెసర్ పై 498ఎ కేసు, అక్రమ సంబంధం ఆరోపణలు
  • మరో ప్రొఫెసర్ పై విద్యార్థులతో ద్వంద్వార్థాలతో మాట్లాడినట్లు ఆరోపణ
  • ఎమ్మార్వో ముందు బైండోవర్ చేశామన్న డీసీపీ రంగారెడ్డి
ఆంధ్రా విశ్వవిద్యాలయంలోని ఇద్దరు ప్రొఫెసర్లను వేర్వేరు కేసుల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వర్సిటీ ఎంఎల్ ఆర్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ రమేష్ బాబుపై 498ఎ కేసు విచారణలో ఉందని, దాంతోపాటు అక్రమ సంబంధం ఆరోపణలున్నాయని విశాఖ డీసీపీ-1 వెల్లడించారు. మరోవైపు సోషల్ వర్క్ విభాగాధిపతి రాగాల స్వామిదాస్ విద్యార్థులను ద్వంద్వార్థ మాటలతో వేధిస్తున్నారని మీడియాలో కథనాలు రావడంతో సుమోటోగా తీసుకున్నామని డీసీపీ చెప్పారు.

వీరిని సీఆర్ పీసీ 41/109 సెక్షన్ కింద అదుపులోకి తీసుకుని ఎమ్మార్వో ముందు బైండోవర్ చేశామని తెలిపారు. ర్యాగింగ్ జరపకుండా నియంత్రించాల్సిన బోధకులే పోలీసులు, ఎమ్మార్వో ముందు కౌన్సెలింగ్ తీసుకోవడం దురదృష్టకరమన్నారు. అత్యున్నత పదవుల్లో ఉండి దిగజారి ప్రవర్తిస్తే చర్యలు తప్పవని డీసీపీ అన్నారు. యూనివర్సిటీలో త్వరలో వర్చువల్ పోలీస్ స్టేషన్ ప్రారంభిస్తామని, విద్యార్థులు ఈ పీఎస్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చని అన్నారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.