విలువలు పెంచే విద్య అందిస్తున్నారు.. కేజ్రీవాల్ కు దలైలామా అభినందన

12-02-2020 Wed 16:24
  • కేజ్రీవాల్ నాయకత్వంలో ఢిల్లీ ప్రజలకు మరిన్ని ప్రయోజనాలు అందుతాయి
  • ప్రభుత్వ స్కూళ్ల సిలబస్ ఎంతో బాగుంది
  • ఢిల్లీ సర్కారు పనితీరు బాగుందని ప్రశంస
Dalai Lama Congratulates Kejriwal

ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్లలో ఘన విజయం సాధించిన అరవింద్ కేజ్రీవాల్ ను బౌద్ధుల మత గురువు దలైలామా అభినందించారు. కేజ్రీవాల్ నాయకత్వంలో ఢిల్లీ ప్రజలకు మరిన్ని ప్రయోజనాలు అందుతాయని చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వ స్కూళ్ల సిలబస్  విద్యార్థుల మానసిక అభివృద్ధికి తోడ్పడుతుందని ప్రశంసించారు. దీనికి సంబంధించి దలైలామా బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

మంచి జీవితానికి తోడ్పడుతుంది

కేజ్రీవాల్ నాయకత్వంలో ఢిల్లీ ప్రజలకు మరింతగా ప్రయోజనాలు అందుతాయని ఆశిస్తున్నట్టు దలైలామా పేర్కొన్నారు. ‘‘మనుషుల్లో విలువలను పెంపొందించేందుకు తోడ్పడేలా, మంచి మనుషులుగా ఎదిగేలా ఢిల్లీ ప్రభుత్వ స్కూళ్లలో కరిక్యులాన్ని ప్రవేశపెట్టడం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అది విద్యార్థులు పూర్తిస్థాయిలో ఎదగడానికి, భవిష్యత్తులో తమ కలలు నెరవేర్చుకోవడానికి, మంచి జీవితాన్ని పొందడానికి తోడ్పడుతుంది. ఇందుకు ఢిల్లీ సర్కారును అభినందిస్తున్నాను’’ అన్నారు.