Hafiz Saeed: టెర్రరిస్టు హఫీజ్ సయీద్ కు జైలు శిక్షను విధించిన పాకిస్థాన్ కోర్టు
- రెండు కేసుల్లో ఐదేళ్ల జైలు శిక్షను విధించిన పాక్ యాంటీ టెర్రరిజం కోర్టు
- 2008 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి సయీద్
- అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గిన పాకిస్థాన్
ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్దవా అధినేత, భారత్ కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుకు పాకిస్థాన్ లోని యాంటీ టెర్రరిజం కోర్టు షాకిచ్చింది. టెర్రరిజానికి సంబంధించిన రెండు కేసుల్లో ఆయనకు ఐదేళ్ల జైలు శిక్షను విధించింది. ఈ మేరకు పాక్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. 2008 ముంబై ఉగ్రదాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులకు సూత్రధారి హఫీజ్ సయీద్ అని భారత్ ఆరోపిస్తోంది.
సయీద్ పై పాకిస్థాన్ లో 23 టెర్రర్ కేసులు ఉన్నాయి. హఫీజ్ సయీద్ పై భారత్ ఆరోపణలు గుప్పిస్తున్నప్పటికీ పాకిస్థాన్ పట్టించుకోలేదు. దేశమంతా స్వేచ్ఛగా తిరుగుతూ భారత్ కు వ్యతిరేకంగా విద్వేషపూరిత ప్రసంగాలు చేసేలా అంటీముట్టనట్టు వ్యవహరించింది. అయితే, ఇటీవలి కాలంలో పాక్ పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో, కోర్టు నుంచి ఈ తీర్పు వెలువడటం గమనార్హం.
2017లో హఫీస్ సయీద్ తో పాటు అతని నలుగురు అనుచరులను పాకిస్థాన్ అరెస్ట్ చేసింది. ఉగ్రవాద చట్టాల కింద కేసులు నమోదు చేసింది. అయితే, అరెస్ట్ అయిన 11 నెలలకు వీరంతా జైలు నుంచి విడుదలయ్యారు.