జాలిలేని టీచరమ్మ... నాలుగో తరగతి విద్యార్థిని చితక బాదిన వైనం

12-02-2020 Wed 13:02
  • విలవిల్లాడిన చిన్నారి
  • ఒంటిపై తీవ్రగాయాలు
  • ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు
Teacher punished student physically in school

టీచర్‌ది తల్లిదండ్రుల తర్వాతి స్థానం. పిల్లల్ని సొంతబిడ్డల్లా చూడాలి. చిన్నచిన్న పొరపాట్లు చేసినా పెద్దమనసుతో క్షమించి మాటలతోనే వారిలో మార్పుకోసం ప్రయత్నించాలి. హైదరాబాద్‌ నల్లకుంటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న సాయిప్రణీత్‌ అనే నాలుగో తరగతి విద్యార్థి పట్ల ఉపాధ్యాయిని ఇవేవీ పాటించలేదు. ఏదో తప్పుచేశాడని చేతిపైన, ఒంటిపైనా వాతలుతేలేలా స్కేలుతో చితక్కొట్టింది.

టీచర్‌ కొట్టిన దెబ్బలకు సదరు విద్యార్థి విలవిల్లాడిపోతున్నా ఆమెలో ఇసుమంతైనా జాలికలగలేదు. కొడుకు ఒంటిపై వాతలు చూసిన తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. పాఠశాలకు వెళ్లి నిర్వాహకులను నిలదీశారు. వారు సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీ కెమెరాల పుటేజీ పరిశీలించి సదరు ఉపాధ్యాయినిపై చర్యలు తీసుకోవాలని బాధిత విద్యార్థి తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు.