AAP: తెరచుకుంటున్న ఈవీఎంలు... కేజ్రీవాల్ హ్యాట్రిక్ ఖాయమేనా?

  • విజయంపై ఆప్ వర్గాల నమ్మకం
  • ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు
  • 21 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు
Delhi Assembly Election Counting begins

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయం వచ్చేసింది. భారీ భద్రత మధ్య, ఈవీఎంలు తెరచుకోనున్నాయి. పోలింగ్ తుది శాతం ఎంతన్న విషయం ఆలస్యంగా ప్రకటించడంతో ఫలితాలపై కొంత ఉత్కంఠ నెలకొనివున్నా, ఎగ్జిట్ పోల్స్ ముక్తకంఠంతో కేజ్రీవాల్ హ్యాట్రిక్ ఖాయమని వెల్లడించిన నేపథ్యంలో, ఆప్ వర్గాలు విజయంపై నమ్మకంతో ఉన్నాయి.

కాగా, ఈ పోటీ ఆప్, బీజేపీ మధ్యే ప్రధానంగా జరిగిందని, కాంగ్రెస్ పార్టీకి ఈ దఫా కూడా నామమాత్రపు సీట్లు దక్కే అవకాశాలు లేవని ఎగ్జిట్ పోల్స్ అంటున్నాయి. ఈ దఫా ఓటింగ్ శాతం తగ్గిన నేపథ్యంలో, అది ఎవరికి ప్లస్ పాయింట్ అవుతుందన్న చర్చ కూడా జరుగుతోంది.

ఈ ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగనుండగా, మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 672 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. న్యూఢిల్లీలోని సీడబ్ల్యూజీ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్, సర్‌ సీవీ రామన్‌ ఐటీఐ, రాజీవ్‌ గాంధీ స్టేడియం, మీరాబాయి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ తదితర 21 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఢిల్లీ పీఠం తమదంటే తమదేనని అటు ఆప్, ఇటు బీజేపీ నేతలు నమ్మకాన్ని వ్యక్తం చేస్తుండగా, తుది ఫలితం మధ్యాహ్నంలోగా వెల్లడవుతుందని, ట్రెండ్స్ 10 గంటలకల్లా తెలుస్తాయని అధికారులు అంటున్నారు.

More Telugu News