19 కాలివేళ్లు.. 12 చేతివేళ్లతో.. భారత మహిళ ప్రపంచ రికార్డుల్లోకి!
- గిన్నిస్ బుక్ లోకి ఒడిశాకు చెందిన కుమారి
- గతంలో 14 కాలివేళ్లు, 14 చేతివేళ్లతో దేవేంద్రా పేర రికార్డు
- పోలిడాక్టిలిజమ్ అనే సిండ్రోమ్ వల్లే ఈ అదనపు వేళ్లు
ఒడిశా రాష్ట్రం, గంజాం జిల్లాలోని కడపడ గ్రామానికి చెందిన కుమారి పుట్టుకతో అదనపు వేళ్లతో జన్మించింది. తల్లి కడుపులోనే ఉన్న సమయంలో పిండం పోలిడాక్టిలిజమ్ అనే సిండ్రోమ్ కు లోను కావడంవల్ల ఆమెకు ఈ అదనపు వేళ్లు వచ్చాయని వైద్యులు తేల్చారు. దీన్ని శస్త్ర చికిత్స ద్వారా సరిచేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. అయితే, మారుమూల ప్రాంతంలో పేద కుటుంబంలో జన్మించిన ఈ మహిళ అదనపు వేళ్లతోనే 63 ఏళ్లు గడిపేసింది.గ్రామస్థులు తనను మంత్రగత్తెగా భావించడంతో బయట తిరగలేకపోతున్నానని చెప్పింది. తాను ఎక్కువ కాలం ఇంట్లోనే గడుపుతున్నట్లు కుమారి వెల్లడించింది. ఈ విషయాన్ని స్థానిక మీడియా బయటపెట్టడంతో విషయం గిన్నిస్ రికార్డుల దాకా వెళ్లిందని తెలుస్తోంది.