ద్వారంపూడి వ్యాఖ్యలు, జనసైనికులపై దాడి పట్ల స్పందించిన పవన్ కల్యాణ్

12-01-2020 Sun 19:09
  • పవన్ ను అసభ్య పదజాలంతో విమర్శించిన వైసీపీ ఎమ్మెల్యే
  • నిరసన తెలిపిన జనసేన కార్యకర్తలపై రాళ్ల దాడి
  • లేఖ రాసిన పవన్ కల్యాణ్
వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ తనపై అసభ్య పదజాలంతో విమర్శలు చేయడం పట్ల జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రజలు ఎన్నుకున్న ఓ ప్రజా ప్రతినిధి బాధ్యత లేకుండా అసభ్యకరంగా మాట్లాడిన విధం చూసి ప్రతి ఒక్కరూ తప్పుబడుతున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ లేఖ విడుదల చేశారు. పైగా సభ్య సమాజం చీత్కరించుకునే పదజాలం ఉపయోగించి మాట్లాడడమే కాకుండా, నిరసన వ్యక్తం చేస్తున్న జనసేన కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేయడం అత్యంత దురదృష్టకరం అని అభిప్రాయపడ్డారు.

తప్పును తప్పు అని చెబుతున్న వారిపై అరాచక శక్తులతో దాడి చేయిస్తే జన సైనికులు వెనుకంజ వేస్తారని భావించవద్దని స్పష్టం చేశారు. రెచ్చగొట్టే రీతిలో వ్యవహరిస్తున్న ఆ ప్రజా ప్రతినిధిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. జనసేన కార్యకర్తలకు అన్యాయం చేసి ఇబ్బంది పెట్టే పరిస్థితే వస్తే ఢిల్లీ పర్యటన నుంచి నేరుగా కాకినాడ వస్తానని హెచ్చరించారు.