ధోనీలా మంచి ఫినిషర్ గా ఎదగాలనుంది: ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ

11-01-2020 Sat 21:08
  • గత ఏడాదిలో ధోనీతో కలిసి ఆడా.. అది నా అదృష్టం
  • భారత్ తో మూడు వన్డేలు ఆడటానికి చేరుకున్న ఆసీస్ జట్టు
  • 14న వాంఖడే స్టేడియంలో తొలి వన్డే

భారత్ తో మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ ఆడటానికి ఆస్ట్రేలియా జట్టు భారత్ కు చేరుకుంది. తొలి మ్యాచ్ కోసం ముంబయిలో ప్రాక్టీస్ కూడా ప్రారంభించింది. ఆ జట్టు వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. భారత జట్టు మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ తన అభిమాన క్రికెటర్ అనీ, అతనిలాగే తాను మంచి ఫినిషర్ కావాలని కోరుకుంటానని అన్నాడు. గత ఏడాది భారత్ లో ఆడిన వన్డే సిరీస్ లో ఆయనతో కలిసి ఆడానని చెప్పాడు. ధోనీతో ఆడటం తన అదృష్టమని పేర్కొన్నాడు.

గత ఏడాది వన్డే ప్రపంకప్ కు ముందు భారత్ లో పర్యటించిన ఆస్ట్రేలియా ఐదు వన్డేల సిరీస్ ఆడిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ ను ఆసీస్ 3-2 తేడాతో సొంతం చేసుకుంది. తాజా సిరీస్ ఈ నెల 14 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా మంగళవారం జరుగనుంది. భారత జట్టులో ధోనీ ఈసారి ఆడటం లేదు.