మొదలైన సంక్రాంతి రద్దీ.. పంతంగి టోల్ గేట్ వద్ద 2 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు

11-01-2020 Sat 09:24
  • వారాంతపు సెలవులు రావడంతో పండుగకు జోష్
  • దారులన్నీ పల్లెలకే..
  • పంతంగి టోల్ గేట్ వద్ద అదనపు కౌంటర్లు తెరిచినా ఫలితం శూన్యం

పండుగ రద్దీ మొదలైంది. పల్లెలకు వెళ్లే వారి వాహనాలతో రోడ్లు కిక్కిరిసిపోతున్నాయి. పండుగ సెలవులకు తోడు వారాంతపు సెలవులు తోడుకావడంతో ప్రజలు పెద్ద ఎత్తున నగరాన్ని వీడుతున్నారు. దీంతో రోడ్లన్నీ బిజీగా మారిపోతున్నాయి. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద ఈ ఉదయం వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. దీంతో దాదాపు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలను త్వరగా పంపించి రద్దీని క్లియర్ చేసేందుకు టోల్ గేట్ వద్ద అదనంగా కౌంటర్లు తెరిచినా ఫలితం లేకుండా పోయింది. అంతకంతకూ పెరుగుతున్న వాహనాల రాకతో మరింత రద్దీగా మారుతోంది. మరోవైపు, ఫాస్టాగ్ మార్గాల్లోనూ రద్దీ కొనసాగుతోంది.