'గరుడ వేగ' దర్శకుడితో నాగార్జున

31-12-2019 Tue 11:09
  • పరాజయాలతో సతమతమవుతున్న నాగ్
  • తాజా చిత్రంగా సెట్స్ పైకి వెళ్లిన 'వైల్డ్ డాగ్'
  • ప్రవీణ్ సత్తారుకి గ్రీన్ సిగ్నల్ 
నాగార్జునను కొంతకాలంగా వరుస పరాజయాలు వెంటాడుతున్నాయి. కొత్త కథలను ఎంచుకుంటూ .. కొత్త దర్శకులకు అవకాశమిస్తూ వెళుతున్నప్పటికీ విజయాలు మాత్రం వరించడం లేదు. ఈ నేపథ్యంలోనే మరో కొత్త దర్శకుడికి అవకాశమిస్తూ, ఆయన 'వైల్డ్ డాగ్' సినిమా చేస్తున్నాడు. పూర్తిస్థాయి యాక్షన్ తో రూపొందే ఈ సినిమాలో ఆయన ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.

ఈ సినిమా తరువాత ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున నటించనున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే ఆయనకి ప్రవీణ్ సత్తారు ఒక కథ వినిపించడం .. నాగార్జునకి బాగా నచ్చడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం జరిగిపోయాయి. ఇది కూడా యాక్షన్ నేపథ్యంలోనే సాగుతుందనీ, ఆదాయపన్ను శాఖ అధికారిగా ఈ సినిమాలో నాగార్జున కనిపించనున్నాడని చెబుతున్నారు. 'గరుడ వేగ' తరువాత ప్రవీణ్ సత్తారు చేస్తున్న సినిమా కావడంతో, సహజంగానే అంచనాలు పెరిగే అవకాశం వుంది.