పౌరసత్వంపై నాడు మన్మోహన్ చెప్పింది ఇదే కదా?: బీజేపీ
- రాజ్యసభలో మన్మోహన్ పౌరసత్వ చట్టానికి అనుకూలంగా మాట్లాడిన వీడియో పోస్ట్
- మన్మోహన్ చెప్పిన అంశాలే సీఏఏలో ఉన్నాయని వెల్లడి
- పాక్, బంగ్లాదేశ్ ల నుంచి వచ్చిన మైనారిటీలకు మద్దతుగా ప్రసంగించారన్న బీజేపీ
‘2003లో రాజ్యసభలో నాటి ప్రతిపక్ష నేత మన్మోహన్ సింగ్ పొరుగుదేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్ మతపరమైన పీడనకు గురైన మైనారిటీలకు పౌరసత్వం కల్పించే విషయంలో ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించాలి అని అన్నారు. ప్రస్తుత పౌరసత్వ సవరణ చట్టం అదే చేసింది’ అని బీజేపీ వీడియోకు అనుబంధంగా వ్యాఖ్యలను జోడించింది.
ఈ వీడియోలో మన్మోహన్ సింగ్ అప్పటి హోం మంత్రి ఎల్ కే అద్వానీని ఉద్దేశించి మాట్లాడారు. ‘నేను శరణార్థులకు సంబంధించి ఒక విషయం చెప్పదల్చుకున్నాను. దేశ విభజన తర్వాత బంగ్లాదేశ్ వంటి దేశాల్లోని మైనారిటీలు మతపరమైన పీడనను ఎదుర్కొన్నారు. ఆ సమయంలో పరిస్థితుల ప్రభావంతో వారంతా శరణార్థులగా మనదేశానికి వస్తే పౌరసత్వం కల్పించడంపై మరింత ఉదారంగా వ్యవహరించాలి. గౌరవనీయులైన ఉప ప్రధాన మంత్రి ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని భవిష్యత్తులో దాని కనుగుణంగా పౌరసత్వ చట్టాన్ని రూపొందిస్తారని భావిస్తున్నాను’ అని మన్మోహన్ చెప్పారు.