sana ganguly: పౌరసత్వ సవరణ చట్టం పై గంగూలీ కుమార్తె కామెంట్లు...సమాధానం చెప్పలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్న దాదా

  • సీఏఏపై ఇన్ స్టాగ్రామ్ లో పోస్టింగ్స్
  • వివాదం కావడంతో రంగంలోకి గంగూలీ 
  • ఆమె చిన్న పిల్లని, వదిలేయాలని వేడుకోలు

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) పై ఆందోళనలు దేశాన్ని కుది పేస్తుంటే టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీకి కుమార్తె సనా గంగూలీ రూపంలో కొత్త చిక్కు వచ్చిపడింది. సీఏఏపై తన ఇన్‌స్టాగ్రామ్ లో సనా పెట్టిన కథనాలు దుమారం రేపడంతో గంగూలీ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సీఏఏను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. దేశరాజధాని ఢిల్లీలోని చారిత్రక జామియా మిలియా ఇస్లామియా (జేఎంఐ) వర్సిటీ విద్యార్థులు కూడా ఆందోళనకు దిగారు. విద్యార్థులపై పోలీసులు అతిగా స్పందించడం విమర్శలకు కారణమైంది.

ఈ నేపథ్యంలో సనా గంగూలీ ప్రముఖ రచయిత కుశ్వంత్ సింగ్ రాసిన 'ది ఎండ్ ఆఫ్ ఇండియా' నవలలోని సారాంశాన్ని పోస్టు చేసింది. జేఎంఐ విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుపట్టింది. ఈ పోస్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

చిన్న వయసులోనే ఎంతో పరిణతితో సనా వ్యవహరించిందని కొందరు ప్రశంసించగా, మరికొందరు వ్యతిరేకించారు. రానురాను ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమవుతుండడంతో గంగూలీ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

'నా కుమార్తె చిన్నపిల్ల. రాజకీయాల గురించి తనకి అంతగా అవగాహన లేదు. ఆ పోస్టు నిజం కాదు. అందువల్ల ఈ వివాదాన్ని ఇక్కడితో వదిలేయండి. నా కుమార్తెను వివాదాలకు దూరంగా ఉంచండి... ప్లీజ్' అంటూ ట్వీట్ చేశారు.

More Telugu News