APSRTC: ఏపీలో ఆర్టీసీ చార్జీల పెంపు.. రేపటి నుంచి అమలు

  • ప్రకటన చేసిన యాజమాన్యం
  • డీజిల్ ధరలు పెరిగాయన్న సంస్థ
  • ఏటా వందల కోట్ల భారం పడుతోందని వెల్లడి
ఏపీలో ఆర్టీసీ చార్జీలు పెంచుతున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. పెంచిన చార్జీలు రేపటి నుంచి అమలు చేస్తున్నట్టు ఎపీఎస్ఆర్టీసీ వెల్లడించింది. పల్లెవెలుగు బస్సుల్లో కిలోమీటరుకు 10 పైసలు పెంచారు. ఎక్స్ ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో కిలోమీటరుకు 20 పైసలు పెంచారు. ఇంద్ర ఏసీ, గరుడ, అమరావతి బస్సుల్లో కిలోమీటరుకు 10 పైసలు పెంచారు. వెన్నెల స్లీపర్ బస్సుల్లో మాత్రం చార్జీలు పెంచలేదు.

అంతేకాకుండా, సిటీ బస్సులకు సంబంధించి 11 స్టేజీల వరకు ఛార్జీల పెంపు లేదని ఆర్టీసీ యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. పల్లెవెలుగు బస్సుల్లో మొదటి 2 స్టేజీలు లేదా 10 కిలోమీటర్ల వరకు చార్జీల పెంపుదల వర్తించదు. పల్లెవెలుగు బస్సుల్లో తదుపరి 75 కిలోమీటర్ల వరకు రూ.5 పెంచుతున్నట్టు ఆర్టీసీ పేర్కొంది.

డీజిల్ ధర గత నాలుగేళ్లలో లీటర్ ఒక్కింటికి రూ.49 నుంచి రూ.70కి చేరిందని వెల్లడించింది. డీజిల్ ధర పెంపు కారణంగా సంస్థకు ఏటా రూ.630 కోట్ల నష్టం వస్తోందని వివరించింది. బస్సుల విడిభాగాలు, సిబ్బంది జీతాలు, ఇతర అలవెన్సుల కారణంగా మరో రూ.650 కోట్ల మేర భారం పడుతోందని తెలిపింది.
APSRTC
Fares
Hike
Buses
Andhra Pradesh
YSRCP
Jagan

More Telugu News