Telugudesam: రాష్ట్రంలో పాలన ఇలాగే సాగితే.. దివాల తీయడం ఖాయం: చంద్రబాబు

  • అభివృద్ధిపై ఒక్క రూపాయి కూడా ఖర్చుచేయలేదు
  • వైసీపీ అధికారం చేపట్టిన 6 నెలల్లోనే ఆర్థిక వ్యవస్థ కుదేలైంది
  • సంపద సృష్టి నిలిచిపోయింది

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ పాలనను తూర్పారబట్టారు. ఈ రోజు ఆయన కర్నూలులో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కావోస్తోందని, ఈ సమయంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ విచ్చలవిడిగా దోచుకున్నారని అన్నారు. ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందన్నారు. సంపద సృష్టించి, ఆదాయాన్ని పెంచి, వచ్చిన ఆదాయాన్నిఅభివృద్ధి, సంక్షేమానికి వ్యయం చేస్తే ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుందన్నారు. రాష్ట్రంలో ఆ విధంగా జరగటంలేదన్నారు.

రాష్ట్రంలో అప్పులు కూడా పుట్టే పరిస్థితి లేదని చెప్పుకొచ్చారు. తమ పాలనలో సంపద సృష్టి చేశామని చెబుతూ.. వైసీపీ అధికారంలోకి వచ్చాక 6 నెలల్లోనే ఆర్థిక వ్యవస్థ కుదేలైందని అన్నారు. ఏడునెలలుగా అభివృద్ధికి ఒక్కరూపాయి కూడా ఖర్చుపెట్టలేదన్నారు. మూలధన వ్యయం అన్నది అతి ముఖ్యమని.. ప్రస్తుతం అది జరగటంలేదని పేర్కొన్నారు. ఈ ప్రభావం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నీరుగార్చిందన్నారు.

More Telugu News