అధికారికంగా రెండు ముక్కలైన జమ్మూకశ్మీర్.. ఇకపై అక్కడ ఎవరైనా ఆస్తులు కొనొచ్చు!
- బుధవారం అర్ధరాత్రి రెండు యూటీలుగా విడిపోయిన జమ్మూకశ్మీర్
- నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- కేంద్రం పరిధిలోకి అక్కడి పోలీసులు, లా అండ్ ఆర్డర్
నిన్న అర్ధరాత్రి కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దీని ప్రకారం, ఇకపై జమ్మూ కశ్మీర్ ప్రజలు పర్మినెంట్ రెసిడెంట్స్ హోదాను కోల్పోతారు. అంతేకాదు, ఇకపై అక్కడి ఆస్తులను కొనుగోలు చేసే అధికారం ఇతర రాష్ట్రాల్లోని ప్రజలందరికీ లభిస్తుంది. అక్కడ ఎవరైనా పెట్టుబడులు పెట్టొచ్చు.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలోని దాదాపు 560 సంస్థానాలను భారత్ లో విలీనం చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 144వ జయంతి సందర్భంగా జమ్మూకశ్మీర్ రెండు ముక్కలైంది. ఈ రోజు మన దేశం 'జాతీయ ఐక్యతా దినోత్సవం'గా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.
జమ్మూకశ్మీర్ కేంద్రపాలితమైన నేపథ్యంలో, ఇకపై అక్కడి పోలీసులతో పాటు, లా అండ్ ఆర్డర్ కేంద్రం పరిధిలోకి వచ్చింది. అయితే, పాలనాపరమైన విషయాలను మాత్రం అక్కడి ప్రభుత్వం చూసుకుంటుంది. లాడక్ మాత్రం పూర్తి స్థాయిలో కేంద్రం అజమాయిషీలో ఉంటుంది.