Karimnagar District: ఆ ఇంజినీరు జీతం రూ.70 వేలు.. జల్సాలకు సరిపోవడం లేదని దొంగగా మారిన వైనం!

  • ఓ సిమెంట్ కంపెనీలో మెకానికల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న దొంగ
  • స్నేహితుడి ద్విచక్ర వాహనం, బంధువుల బంగారం చోరీ
  • ఎట్టకేలకు చిక్కిన నిందితుడు

జల్సాలకు అలవాటు పడిన ఓ ఇంజినీరు రూ.70 వేల వేతనం కూడా సరిపోకపోవడంతో దొంగగా మారాడు. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు చోరీలు చేస్తూ 32 తులాల బంగారం, ద్విచక్ర వాహనాలు దొంగిలించాడు. మూడు దొంగతనాల తర్వాత పోలీసులకు చిక్కాడు. మంచిర్యాల జిల్లా మందమర్రి పోలీసుల కథనం ప్రకారం..

కరీంనగర్ జిల్లా చింతకుంటకు చెందిన తూముల శ్రీకాంత్ మెకానికల్ ఇంజినీర్. 2013లో ఓ సిమెంట్ పరిశ్రమలో ఉద్యోగంలో చేరాడు. నెలకు రూ.70 వేల వేతనం వస్తున్నప్పటికీ జల్సాలకు అలవాటు పడిన అతడికి ఆ మొత్తం ఏ మూలకూ సరిపోవడం లేదు. దీంతో చోరీలకు ప్రణాళిక రూపొందించాడు. స్నేహితుడి ద్విచక్ర వాహనాన్ని దొంగిలించడంతోపాటు బంధువుల ఇళ్లలో చోరీ చేసి 32 తులాల బంగారు ఆభరణాలను కాజేశాడు. వాటిని విక్రయించి జల్సాలు చేసేవాడు. దేవాపూర్ పోలీస్ స్టేషన్‌లో రెండేళ్లలో ఇతడిపై మూడు కేసులు నమోదయ్యాయి. శనివారం సోమగూడెం క్రాస్‌రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు శ్రీకాంత్ చిక్కాడు. అతడి నుంచి చోరీ చేసిన 32 తులాల బంగారం, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

More Telugu News