Telangana: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కుదరదు: మంత్రి పువ్వాడ స్పష్టీకరణ

  • విలీనం గురించి టీఆర్ఎస్ మేనిఫెస్టోలో చెప్పలేదని వివరణ
  • సమ్మెను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామన్న మంత్రి
  • విపక్షాలను ప్రజలు ఈసడించుకుంటున్నారని వ్యాఖ్యలు
తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె విరమణకు ససేమిరా అంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కుదరని పని అని తేల్చిచెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ ఈ విషయం చెప్పలేదని స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మెను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని వివరించారు. ప్రజా రవాణా వ్యవస్థ కుంటుపడకుండా 7,358 ప్రైవేట్ వాహనాలను నడుపుతున్నట్టు చెప్పారు.

తాము చర్చలకు సానుకూలంగా ఉన్నా, కార్మిక సంఘాల నేతలే చర్చల నుంచి వైదొలగి వెళ్లిపోయారని పువ్వాడ ఆరోపించారు. తమపై విపక్షాలు చేస్తున్న విమర్శల్లో పసలేదని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారా? అంటూ ప్రశ్నించారు. కమ్యూనిస్టులు పాలిస్తున్న కేరళలో ఆర్టీసీని ఎందుకు విలీనం చేయలేదని అన్నారు. ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న విమర్శలు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని, 2018లో ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో ఓసారి ప్రతిపక్షాలు గుర్తెరగాలని హితవు పలికారు.
Telangana
TSRTC
Puvvada Ajay Kumar

More Telugu News