ఆహూతుల ఎంగిలి ప్లేట్లను ఎత్తిన జస్టిస్ చల్లా కోదండరామ్!

12-10-2019 Sat 08:25
  • సీనియర్ న్యాయమూర్తి సంజయ్ కుమార్ కు వీడ్కోలు కార్యక్రమం
  • అల్పాహారం తినేసి ప్లేట్లు వదిలెళ్లిపోయిన ఆహూతులు 
  • స్వయంగా వాటిని తొలగించేందుకు పూనుకున్న చల్లా కోదండరామ్

ఆయన హైకోర్టు న్యాయమూర్తి చల్లా కోదండరామ్. తన హోదాను మరచి, భేషజాలు లేకుండా ఇతరులు తిన్న ఎంగిలి ప్లేట్లను తీశారు. ఈ ఘటన హైకోర్టు ప్రాంగణంలోనే జరిగింది. సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ కు వీడ్కోలు కార్యక్రమం జరుగగా, న్యాయమూర్తులు, న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. టీ, బిస్కెట్లు, సమోసాలతో తేనీటి విందు జరిగింది.

ఆపై అందరూ తమ తమ ప్లేట్లను ఎక్కడ పడితే అక్కడ పడేసి వెళ్లిపోయారు. దీన్ని గమనించిన జస్టిస్‌ చల్లా కోదండరామ్‌, బాధ్యతగల న్యాయవాదులు ఇలా చేయడాన్ని చూసి భరించలేక, వెంటనే ఆ ప్రాంతమంతా కలియ తిరుగుతూ, న్యాయవాదులు తిని పారేసిన ప్లేట్లను తీయడం ప్రారంభించారు. తొలుత ఈ దృశ్యాన్ని చూసిన న్యాయవాదులకు ఆయన ఏం చేస్తున్నారో అర్థం కాలేదు. ఆ తరువాత ఎంగిలి ప్లేట్లు తీస్తున్నారని తెలుసుకుని, ఆయనతో పాటు పలువురు న్యాయవాదులు ప్లేట్లను తీయడం మొదలు పెట్టారు.