మారని కశ్మీర్.. ట్రక్కు డ్రైవర్ ను రాళ్లతో కొట్టి చంపిన దుండగులు
- సైనిక వాహనం అనుకుని ట్రక్కుపై దాడి చేసిన అల్లరి మూకలు
- ట్రక్కు డ్రైవర్ తలకు బలమైన గాయం
- ఆసుపత్రికి తరలించినా దక్కని ఫలితం
నూర్ మొహమ్మద్ దార్ (42) అనే ట్రక్కు డ్రైవర్ పై దుండగులు దాడి చేశారు. పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఆయనపై కిరాయి మూకలు రాళ్లు రువ్వాయి. ఈ ఘటనలో ఆయన ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనపై జమ్మూకశ్మీర్ పోలీసులు స్పందిస్తూ, అల్లరి మూకలు నూర్ మొహమ్మద్ పై పొరపాటున దాడి చేశాయని తెలిపారు. సైనిక వాహనం అని పొరపడి అతని ట్రక్కుపై దాడి చేశారని చెప్పారు. ఒక రాయి అతని తలపై బలంగా తాకడంతో, అతను తీవ్రంగా గాయపడ్డాడని తెలిపారు. హుటాహుటిన అతన్ని ఆసుపత్రికి తరలించామని... అతను అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారని వెల్లడించారు. బిజ్ బేరా పోలీస్ స్టేషన్ లో హత్య కేసును నమోదు చేశామని తెలిపారు.