వైఎస్ కనుమూసిన రోజున, అదే ప్రాంతం నుంచి... 'రచ్చబండ'ను ప్రారంభించాలని జగన్ కీలక నిర్ణయం!
- నాడు రచ్చబండకు వెళుతూ అసువులు బాసిన వైఎస్
- సెప్టెంబర్ 2 నుంచి చిత్తూరు జిల్లాలో జగన్ రచ్చబండ
- క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యం
వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించిన సెప్టెంబర్ 2 నుంచి చిత్తూరు జిల్లాలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని సీఎంఓ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం జగన్ అమెరికాలో ఉండగా, ఆయన తిరిగి రాగానే పర్యటన షెడ్యూల్ ఖరారవుతుందని సమాచారం. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా తొలిసారి జగన్ ప్రజల్లోకి వెళ్లినట్టు అవుతుంది. తన పాదయాత్రలో భాగంగా కోట్లాదిమందిని దగ్గర నుంచి చూసిన జగన్, వారి సమస్యలను మరింత లోతుగా చర్చించేందుకు రచ్చబండను వినియోగించుకోవాలని భావిస్తున్నట్టు పార్టీ నేతలు అంటున్నారు.
ప్రభుత్వ పథకాల అమలుతీరు, గ్రామ వాలంటీర్ల విధానం, ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై క్షేత్ర స్థాయిలో అభిప్రాయాలను జగన్ తీసుకోనున్నారు. ఈ కార్యక్రమం అన్ని జిల్లాల్లోని ఎంపిక చేసిన గ్రామాల్లో కొనసాగుతుందని సమాచారం.