చంద్రబాబు సామాన్లను బయట పడేయాలన్న టార్గెట్ తో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది!: వర్ల రామయ్య
- అన్ని ఇళ్లను మొదట ఖాళీ చేయమనండి
- మేం కూడా నిబంధనల మేరకు ఖాళీ చేస్తాం
- ఆర్కేకు చంద్రబాబు ఇంటిదగ్గర ఏం పని?
‘ఈ కరకట్టపై ఉన్న అన్ని ఇళ్లను ఖాళీ చేయించుకుని రమ్మనండి. చంద్రబాబు గారి ఇంటినే మొట్టమొదట ఖాళీ చేయించాలి, ఆయన సామాన్లను బయటపడేయాలన్న టార్గెట్ తో ఈ ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఇది కరెక్ట్ కాదండి. దీన్ని మాత్రమే మేం తప్పుపడుతున్నాం. అన్ని ఇళ్లను ఖాళీ చేయించాం. మీరు కూడా చేయండి అంటే అందుకు మేం రెడీనే. వరదలోనే ఉంటామని మేం చెప్పడం లేదే. కక్షలు ఎందుకు? ఓ ప్రోసీజర్ ప్రకారం ముందుకు వెళ్లమని చెబుతున్నాం.
ఈ దగాకోరు, పనికిమాలిన రాజకీయం ఎందుకు? చంద్రబాబు ఈరోజు హైసెక్యూరిటీ వ్యక్తి అని ఈరోజు గుర్తుకు వచ్చిందా? నిన్న చంద్రబాబు ఇంటిపై డ్రోన్లు ఎగిరినప్పుడు రెవెన్యూ అధికారులకు ఇది గుర్తుకురాలేదా? ప్రభుత్వం మనసులో ఒకటి పెట్టుకుని బయట ఇంకొకటి చేస్తోంది. అసలు చంద్రబాబు ఇంటి దగ్గరకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రావాల్సిన అవసరం ఏంటి? మేం టీడీపీ నేతలం కాబట్టి మా నాయకుడి ఇంటి దగ్గరకు వచ్చాం. ఆర్కే, ఇతర వైసీపీ నేతలు రోజూ ఇక్కడకు వస్తున్నారు. మంగళగిరిలో చాలా గ్రామాలు నీట మునిగినా, ఆళ్ల రామకృష్ణా రెడ్డి వాటిని పట్టించుకోకుండా ఇక్కడ తిరుగుతున్నారు. వీళ్లందరూ కూడా చంద్రబాబు మీద కక్ష తీర్చుకున్నాం అని చెప్పడం కోసమే ఈ రకంగా చేస్తున్నారు’ అని వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.