Kim Jong Un: మళ్లీ మాట తప్పిన కిమ్... రెండు క్షిపణుల ప్రయోగం!

  • స్వల్ప శ్రేణి క్షిపణుల పరిశీలన
  • దక్షిణ కొరియాకు హెచ్చరికగానే
  • స్వయంగా ప్రకటించిన కిమ్

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మరోసారి మాట తప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో అణు నిరోధక చర్చలు జరిగిన తరువాత తొలిసారిగా క్షిపణి ప్రయోగాలను చేపట్టారు. తక్కువ దూరాలను ఛేదించే సత్తా ఉన్న రెండు స్వల్ప శ్రేణి క్షిపణులను ఉత్తర కొరియా అధికారులు సముద్రంలోకి ప్రయోగించి పరీక్షించారు. కిమ్ చేపడుతున్న న్యూక్లియర్‌ పరీక్షల నిలుపుదలపై అమెరికాతో జరుపుతున్న చర్చలకు తాజా ప్రయోగం విఘాతం కల్పించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కాగా, రెండు కొత్త రకం క్షిపణులను తయారు చేయించిన కిమ్ వాటిని పరిశీలించారు. ఇందులో ఒకటి 430 కిలోమీటర్లు, రెండోది 690 కిలోమీటర్లు ప్రయాణించి, లక్ష్యాన్ని తాకినట్టుగా సియోల్‌ అధికార వర్గాలు వెల్లడించాయి.

ఓ వైపు శాంతి మంత్రాలు చెబుతూ, మరోవైపు ఆయుధాలను పెంచుకుంటూ, తమ సరిహద్దుల్లోనే వాటిని మోహరిస్తూ, ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్న దక్షిణ కొరియాకు హెచ్చరికగానే ఈ క్షిపణులను పరిశీలించినట్టు కిమ్ జాంగ్ స్వయంగా ప్రకటించడం గమనార్హం. దక్షిణ కొరియా, అమెరికాలు కలిసి సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయని మండిపడిన ఆయన, దక్షిణ కొరియా నేతలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కిమ్ తాజా క్షిపణి ప్రయోగాలపై స్పందించిన యూఎస్, కవ్వింపు చర్యలను మానుకోవాలని హితవు పలికింది. నార్త కొరియాతో చర్చలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.

More Telugu News